తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ పూర్తిగా ఇరుక్కుపోవడంతో తమను కాపాడాలంటూ జగన్ బీజేపీ నేతలకు అదే పనిగా ఎక్స్ లో ట్యాగ్ చేసిన ఫలితం కనిపించకపోవడంతో రూట్ మార్చారు. శరణు వేడుకుంటూ కనిపించిన బీజేపీని సైతం ఆఖరుకు శత్రు పార్టీ జాబితాలో కలిపేసింది వైసీపీ. ఇప్పటి వరకు ఈ విషయంలో షర్మిల మినహా కాంగ్రెస్ నేతలు ఆచితూచి స్పందించగా… తాజాగా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ అంటే కూటమికి భయమని.. అందుకే నెల రోజులపాటు తిరుమలలో అంతటా సెక్షన్ 30అమలు చేయాలని నిర్ణయించారని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జగన్ పై తీవ్ర విమర్శలు కురిపించిన చింతా మోహన్ అనూహ్యంగా ఆయనకు ఎలివేషన్స్ ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది.
తిరుమల లడ్డూ విషయంలో మొదటి నుంచి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోన్న షర్మిల…సుప్రీంకోర్టులో జరిగిన విచారణ తన వాదనకు బలం చేకూర్చేలా ఉందని చెప్పుకొచ్చారు.దేవదేవుడి ప్రసాదాన్ని కలుషితం చేయడంలో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంటే నిగ్గు తేల్చాలని గట్టిగా డిమాండ్ చేస్తుండగా.. చింతా మోహన్ మాత్రం సీబీఐ విచారణలాంటిదేం కోరకుండా జగన్ ను చూస్తేనే కూటమి భయపడుతుందని వ్యాఖ్యానించడం వెనక వ్యూహం ఉందా? షర్మిలకు చెక్ పెట్టేందుకే ఈ కామెంట్స్ చేశారా? అని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి .
షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒంటెత్తు పోకడలు పోతున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దాంతోనే ఆమెపై అసహనంతోనే జగన్ కు చింతా బూస్టింగ్ ఇచ్చారా? లేదంటే కాంగ్రెస్ – వైసీపీల మధ్య బంధం చిగురించనుందనే ముందుచూపుతో ఈ కామెంట్స్ చేశారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.