రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, సమైక్యాంధ్ర పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన మాటలతో చాలా ఇరకాటంలో పెట్టేవారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరిస్తునప్పటికీ ఆయన పార్టీకి విధేయుడే.. విభజన ప్రక్రియను ఆయనే స్వయంగా చూసుకొంటారు…అని చెపుతూ ప్రజలలో ఆయన పట్ల అపనమ్మకాన్ని కలిగించగలిగారు. తత్ఫలితంగా అంతకాలం రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఒక్కసారిగా అగమ్యగోచరంగా మారిపోయింది.
అదేవిధంగా సమైక్యాంధ్ర పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని “అతను నా కొడుకు వంటి వాడు. కాంగ్రెస్ లో ఉండి ఉంటే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు. కానీ ఏదో ఒకరోజున కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను,” అని చెప్పడం ద్వారా ఎన్నికలలో గెలిచేందుకే కాంగ్రెస్ పార్టీ ఆయన కలిసి నాటకం ఆడుతున్నారనే తెదేపా ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది. ప్రజలలో జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా అనుమానాలు రేకెత్తించగలిగారు. తత్ఫలితంగా వైకాపా ఎన్నికలలో ఓడిపోయింది.
ఆవిధంగా ఇద్దరి రాజకీయ జీవితాలను తారుమారు చేసిన దిగ్విజయ్ సింగ్ దృష్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిపై పడిందిప్పుడు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అవసరమయితే ఆయనతో కలిసి పోరాడేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్దమని ప్రకటించారు. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి మేలు కలిగించే అనేక హామీలను తమ ప్రభుత్వం ఇచ్చిఅప్పటికీ మోడీ ప్రభుత్వం వాటిని విస్మరించిందని, కనుక వైకాపాతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని తెలిపారు.
ఆయన చెప్పిన ఈ మాటలతో వైకాపాకు మళ్ళీ తెదేపా నేతల నుండి అవే ప్రశ్నలు ఎదురవడం ఖాయం. ఏదో ఒకనాడు తల్లి, పిల్లా కాంగ్రెస్ పార్టీలు ఏకం కావడం తధ్యమని తెదేపా నేతలు ఆరోపణలు చేయడం మొదలుపెడితే వాటికి సంజాయిషీలు చెప్పుకోక తప్పదు. రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించేందుకు సిద్దంగా లేరు. గత 16 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు, పోరాటాలు చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు అంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంతటివాడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైకాపాలో చేరిపోయారు. కానీ దిగ్విజయ్ సింగ్ చెపుతున్న మాటలతో మళ్ళీ తల్లీ, పిల్లా దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాయా? అనే అనుమానం కలుగడం సహజం. రాహుల్ గాంధీ సూచించిన తరువాతే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి పోరాటాలు మొదలు పెట్టడం, ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వచ్చి జగన్ కి మద్దతు తెలపడం, ఆయనతో కలిసి తమ పార్టీ పోరాడుతుందని చెప్పడం చూస్తే ఆ అనుమానాలు నిజమేననిపిస్తుంది.
జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి రాష్ట్రంలో వైకాపాను బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తాము తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీతో అతను చేతులు కలుపుతాడని ప్రజలకు అనుమానం కలిగితే, వారు వైకాపాని కూడా దూరం పెట్టవచ్చును. కనుక దిగ్విజయ్ సింగ్ ఇస్తున్న ఈ ఆఫర్ ని జగన్మోహన్ రెడ్డి స్వీకరించకపోవచ్చును.