గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులని ప్రసన్నం చేసుకొనేందుకు సమస్యలని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు నిత్యం అనేక సమస్యలను ఆయంన దృష్టికి తెస్తున్నా గవర్నర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఒక పక్క రైతులు భూములు కోల్పోయి బాధలు పడుతుంటే, గవర్నర్ తాత్కాలిక సచివాలయం చాలా బాగుందని, చంద్రబాబు నాయుడు మంచి సమర్ధుడని పొగడటం సిగ్గు చేటని అన్నారు.
ఏదైనా రాష్ట్రంలో గవర్నర్ కొంచెం అత్యుత్సాహం చూపిస్తే ఆయన కేంద్రప్రభుత్వం తరపున కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తుంటాయి. డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్య జరుగుతున్న యుద్ధం అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవేళ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టకుండా సఖ్యతగా మెలిగితే ఈవిధంగా విమర్శలు భరించవలసి వస్తుంది.
ఎమ్మెల్యేల ఫిరాయింపులు, రాజధానికి భూసేకరణ వంటి అనేక సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు గవర్నర్ కి పిర్యాదులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడం వాస్తవమే. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ కి ఉన్న పరిమితులు, రాజకీయ ఇబ్బందులు దృష్ట్యా గవర్నర్ కొన్ని విషయాలలో చొరవ తీసుకోలేరని ఆయనని విమర్శిస్తున్నవారికి కూడ తెలుసు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగోకపోతే ఆ విషయం గురించి కేంద్రానికి తెలియజేయడం వరకే ఆయన బాధ్యత. బద్ధ శత్రువులులాగ వ్యవహరిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులని సముదాయించుకొంటూ పనిచేయడం కత్తిమీద సామువంటిదే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సమస్యలు, అవినీతి, మంచి చెడుల గురించి గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తెలియజేయకుండా ఉంటారని అనుకోలేము. ఆయన తన పరిధులని గుర్తించి ఆ మేరకే నడుచుకొంటున్నారు. కనుక గవర్నర్ ని తప్పు పట్టలేము.