ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ తెరమీదికి వస్తున్నట్టు కనిపిస్తోంది..! అధికార పార్టీ టీడీపీలో మరోసారి చేరికల పర్వం ఉంటుందనే సంకేతాలే వస్తున్నాయి. ఇప్పటికే, వైకాపా నుంచి కొంతమంది వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు టీడీపీ దృష్టి కొంతమంది కాంగ్రెస్ నేతలపై పడ్డట్టు సమాచారం. 2014 ఎన్నికల ఓటమి తరువాత, పార్టీ కార్యక్రమాలకు దూరంగా తటస్థంగా ఉంటున్న కొంతమందిపై టీడీపీ కూడా దృష్టి సారించినట్టు కథనం! ఇదే క్రమంలో ఈరోజు ఇద్దరు నేతలు టీడీపీ అధినాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్టు కథనాలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అంశంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు గంట సేపు జరిగిన ఈ భేటీలో… కనిగిరి టిక్కెట్ పై స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ నర్సింహారెడ్డి కోరినట్టు సమాచారం. అయితే, ఈయన చేరిక అంశమై సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుతో కూడా ఓసారి చర్చించాక చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఇంకోపక్క, మాజీ మంత్రి కోండ్రు మురళీ కూడా టీడీపీ చేరేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుతో ఆయన ఇప్పటికే భేటీ అయ్యారని సమాచారం! శ్రీకాకుళం జిల్లా రాజాం టిక్కెట్ ఆయన ఆశిస్తున్నారట. దీనిపై స్పష్టమైన హామీ లభిస్తే, ఆయన చేరిక లాంఛనమే అంటున్నారు. అయితే, రాజాంలో పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ప్రతిభా భారతి ఈయన రాకను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి, ఆమెతో కూడా పార్టీ అధినాయకత్వం సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. వీరితోపాటు… సబ్బం హరి, దాడి వీరభద్రరావులు కూడా టీడీపీలోకి వస్తారనే ఊహాగానాలున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే టీడీపీలో వలస నేతలు చాలామందే ఉన్నారు కదా… కాంగ్రెస్ నేతలపై ఇప్పుడు ఫోకస్ ఎందుకనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది! పార్టీ బలహీనంగా ఉన్న నియోజక వర్గాల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనీ, ఆయా నియోజక వర్గాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతల్ని చేర్చుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. అయితే, వలసల వల్ల ఎంత లేదనుకున్నా… స్థానిక కేడర్ లో కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తాయన్నది వాస్తవం! ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకుంటున్నామని రాష్ట్రస్థాయి నాయకత్వం బుజ్జగించే ప్రయత్నం చేసినా… ఆ అసంతృప్తి కొంత కచ్చితంగా ఉంటుంది. ఎన్నికలు సమీపించే సమయానికి దాన్ని టీడీపీ ఎలా డీల్ చేయగలదు అనేది చూడాలి. ఓపక్క, కాంగ్రెస్ మరోసారి ఏపీలో బలోపేతం కావాలని పాత నేతల్ని మళ్లీ ఆహ్వానిస్తుంటే… ఇంకోపక్క టీడీపీ కూడా కాంగ్రెస్ నేతల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉండటం గమనార్హం.