కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వచ్చారు. ఆయన కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సమావేశం అయి పరిస్థితిని చక్కబెడతారు. అయితే తమ అసంతృప్తిని గుర్తించి దూతను పంపినందుకు వారు మరింత బెట్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తప్పించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు. తొమ్మిది మంది నేతలు ఒకే సారి మీటింగ్ పెట్టుకోవడంతో ఉలిక్కిపడిన హైకమాండ్ సలహాదారుడిగా దిగ్విజయ్ సింగ్ ను హైకమాండ్ నియమించింది. దీంతో దిగ్విజయ్ పలువురికి ఫోన్లు చేసి తొందరపడవద్దని చెప్పారు.
ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ను ఢిల్లీలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిసి తన వాదన వినిపించినట్లుగా తెలుస్తోంది. టీ పీసీసీ సీనియర్ల వ్యవహారశైలి, ఇతర పార్టీలతో అంట కాగుతున్న వైనం.. సొంత పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విషయాలపైనా రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటనపై రేవంత్ వర్గం పెద్దగా గాభరా పడటం లేదు.కానీ రేవంత్ కు వ్యతిరేకంగా దిగ్విజయ్ వద్ద పెద్ద ఎత్తున తమ వాదన వినిపించేందుకు సీనియర్లు రెడీ అయ్యారు.
అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ సీనియర్ల డిమాండ్లను హైకమాండ్ ఆలకించే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డినే కొనసాగిస్తారని అందులో మరో మాటే ఉండదని అంటున్నారు. పార్టీకి బద్దులుగా పని చేస్తే భవిష్యత్ ఉంటుందని ..లేకపోతే ఎవరి దారి వారు చూసుకోవాలని దిగ్విజయ్ పరోక్షంగా సూచిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. కారణం ఏదైనా.. హైకమాండ్ తీరు వల్లే అసంతృప్తి నేతలు బలం పుంజుకుంటున్నారని .. ఇది కాంగ్రెస్ కు చేటు చేస్తోందని ఆ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.