సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజంపేట మాజీ ఎంపి మరియు మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ గురువారంనాడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెదేపాలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన కూడా దృవీకరించారు. వైకాపాకి కంచుకోట వంటి కడప జిల్లాలో ఎలాగయినా పట్టు సాధించాలని భావిస్తున్న తెదేపా దృష్టి జిల్లాలో మంచి ప్రజాదారణ, పలుకుబడి ఉన్న ఆయనపై పడింది. రాజంపేట నుంచి వరుసగా తొమ్మిదిసార్లు లోక్ సభకి ఎన్నికయ్యారు. కేంద్రంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేసారు. కానీ రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఏర్పడిన వ్యతిరేకత కారణంగా 2014 ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు.
రాష్ట్ర విభజన జరిగి సుమారు రెండేళ్ళు పూర్తికావస్తున్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పు కనబడటం లేదు. పైగా నానాటికీ ఇంకా దయనీయంగా మారుతోంది. కేంద్రమంత్రి స్థాయిలో పని చేసిన ఆయన వైకాపాలో చేరినట్లయితే జగన్మోహన్ రెడ్డి అహాన్ని భరించవలసి ఉంటుంది. అది తన వల్ల కాదనే ఆయన వైకాపాలో చేరే ఆలోచన చేయలేదు.
ఈ మధ్య కాలంలో అన్ని పార్టీల దృష్టి కాపు సామాజిక వర్గం మీదనే ఉంది కనుక అదే సామాజిక వర్గానికి చెందిన సాయి ప్రతాప్ ని పార్టీలోకి తీసుకొన్నట్లయితే రెండు విధాలుగా పార్టీకి ప్రయోజనం ఉంటుందనే ఆలోచనతో ఆయనను సంప్రదించగా ఆయన తెదేపాలో చేరేందుకు అంగీకరించారు. ఇవ్వాళ్ళ చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెదేపాలో చేరబోతున్నారు.