ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు.. విజయవాడలో జరిగిన ఓ సంఘటన అమితమైన సంతోషాన్ని కలిగించి ఉంటుంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ఊమెన్ చాందీ సహా.. అనేక మంది ముఖ్యనేతలు ఉన్న సమావేశంలో జరిగిందీ ఆ ఘటన. అక్కడున్న నేతలు సంతోషాన్ని బయటకు వ్యక్తం చేయలేని ఘటన అది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేరడమో.. కీలకమైన నేత చేరబోతున్నారనే సమాచారం అందడమో అక్కడ జరగలేదు. ఓ చోటా నేత ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. కాంగ్రెస్ నేతలు ఎందుకు సంతోష పడతారంటారా..? అక్కడే ఉంది లాజిక్.. ఆ ఆత్మహత్యాయత్నం ఎందుకంటే.. నెల్లూరు రూరల్ టిక్కెట్ తనకే ఇవ్వాలని అట. అందు కోసం ముందుగా.. అక్కడ తనను ఇన్చార్జ్ గా నియమించాలని డిమాండ్ చేస్తూ.. పురుగుల మందు తాగబోయాడు.. ఆ చోటా నేత.
కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేయమంటే… పారిపోయిన పరిస్థితులను గత ఎన్నికల్లో చూసిన కొంత మంది ముఖ్య నేతలను.. నెల్లూరుకు చెందిన ఈ శివాచారి అనే చోటా నేత ఆశ్చర్యపరిచారు. ఎఫీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముఖ్యనాయకులంతా చర్చిస్తున్న సమయంలోనే.. శివాచారి అరుపులు కేకలతో హంగామా సృష్టించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్నా.. తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని శివాచారి ఆరోపిస్తున్నారు. తనకు ఇన్ ఛార్జి పదవి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగుల మందు డబ్బా చూపించాడు. కార్యకర్తలు అతన్ని అడ్డుకుని, పురుగుల మందు డబ్బా లాక్కున్నారు. తనకు అన్యాయం చేస్తే.. ఇప్పుడు కాకపోయినా.. తర్వాత అయినా పార్టీ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై పోటీ చేయమంటే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే పరిస్థితి నుంచి ఇప్పుడు టిక్కెట్ కోసం.. ఆత్మహత్య చేసుకుటానని హెచ్చరించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎదిగిందని.. కాంగ్రెస్ పార్టీ నేతల మనసు సంతోషంతో నిండిపోయి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకపోతే.. అభ్యర్థుల్ని ఎలా వెదుక్కోవాలా అని మథన పడుతున్న సమయంలో.. పోటీ చేసేందుకు ప్రాణాలు తీసుకునేందుకు కూడా సిద్ధపడేవారున్నారన్న ధైర్యాన్ని శివాచారి కాంగ్రెస్ పార్టీ నేతలకు అందించారు.