హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయానికి కారణం ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్(ఫలితాలను తారుమారు చేయటం) కారణమంటూ టి కాంగ్రెస్ నేతల రగడ చేస్తున్నారు. ట్యాంపరింగ్ వలనే టీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ పార్టీలకు అత్యధిక సీట్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని అపహాస్యం చేస్తున్నాయని అంటున్నారు. గ్రేటర్లో ఒకచోట ఇండిపెండెంట్‌గా పోటీచేసిన ఒక మహిళా అభ్యర్థికి ఒక్క ఓటుకూడా పడలేదని, ఆమె, ఆమె ఇంట్లో వారు కలిపి మొత్తం 12 మంది ఉన్నారని కనీసం వారి ఓట్లు కూడా నమోదవలేదని, ట్యాంపరింగ్‌కు ఇదే నిదర్శనమని చెబుతున్నారు.
మరోవైపు మేయర్ ఎన్నికకోసం అధికారపార్టీ ఎక్స్ అఫిషియో సభ్యులను చేర్చుకోవటానికి వ్యతిరేకంగా హైకోర్టులో న్యాయ పోరాటం చేసిన కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, ఆ పార్టీకి చెందిన్ మరి కొందరు నేతలు ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్‌పై ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీని కలిశారు. నారాయణఖేడ్ ఉపఎన్నికలోనైనా ట్యాంపరింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన వినతిపత్రాన్ని సీఈసీకి అందించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ ఉపఎన్నికలోనే తమకు ఈవీఎమ్‌లపై అనుమానాలు వచ్చాయని, తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో అది నిజమైందని దాసోజు శ్రవణ్ చెప్పారు. నారాయణఖేడ్ ఉపఎన్నికలో బ్యాలట్ పేపర్ గానీ, ఈవీఎమ్లకు ప్రింటర్లు పెట్టటంగానీ చేయాలని సీఈసీని కోరినట్లు తెలిపారు.