తెలంగాణ వెటరన్ కాంగ్రెస్ లీడర్ వి.హన్మంతరావు.. తానింకా.. యూతేననుకుంటూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనకు ఆయన చొచ్చుకు వచ్చేస్తూంటారు. అవసరం లేని వివాదాల్లోనూ తల దూర్చేస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఈయనో హాబీ పెట్టుకున్నారు. అదేమిటంటే.. బస్సులపై పోస్టర్లు చించేయడం. ఆదివారం ఆయన నాచారంలో అలా బయటకు వెళ్లినప్పుడు… ఆర్టీసీ బస్సుకు అతికించిన కేసీఆర్ పోస్లర్లు కనిపించాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలిగించకలేదని ఆయనకు లైట్ వెలిగింది. వెంటనే కిందకు దిగి ఆర్టీసీ బస్సుపై ఉన్న కేసీఆర్ ప్రచార పోస్టర్లను చింపేశారు. ఆ తర్వాత తన అక్కసును వెళ్లగక్కారు.
వీహెచ్ చేసిన విన్యాసం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ రిపీటయింది. అదే అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధించి ఇదే ఫీట్‌ను వీహెచ్ చేశారు. నిజానికి అర్జున్ రెడ్డికి క్రేజ్ తీసుకు వచ్చింది.. వీహెచ్ చేసిన ఓవర్ యాక్షనే. అర్జున్ రెడ్డి అనే సినిమా విడుదలకు తంటాలు పడుతూ ఉంటే… ఆ సినిమాకు క్రేజ్ ఎలా తెచ్చుకోవాలో తెలియక… దర్శకనిర్మాతలు హీరోలు.. నానా ఫీట్లు చేసినా… పెద్దగా ఎవరికీ పట్టలేదు. ఎందుకంటే.. ఆ సినిమాపై ఎవరికీ అంచనాల్లేవు. కానీ… షాలినీపాండే, విజయ్ దేవరకొండల లిప్ టు పిల్ కిస్ ఫోటోలను ఆ సినిమా యూనిట్ బస్సులకు అంటించేసింది. ఈ పోస్టర్లు వీహెచ్ కంట బడ్డాయి. వెంటనే ఆయన మోరల్ పోలీసింగ్‌కు దిగిపోయి… మీడియాను పిలిచి.. మరీ పోస్టర్లను చించేశారు. దాన్ని అర్జున్ రెడ్డి టీం అందుకుంది. “చిల్ తాతయ్య..” అంటూ చెలరేగిపోయింది. అంతే క్రేజ్ …శ్రీహరి కోట నుంచి అంతరిక్షానికి పంపిన రాకెట్లా దూసుకుపోయింది. అంతిమంగా బ్లాక్ బస్టర్ అయిపోయింది. విజయ్ దేవరకొండ సూపర్ స్టారైపోయారు. వ్యతిరేకించినా… దేవరకొండ స్టారిజంలో వీహెచ్ పాత్ర కూడా ఉంది.
ఇప్పుడు.. మళ్లీ అదే ఫీట్‌ను రిపీడ్ చేశారు.. హన్మంతన్న. మరి టీఆర్ఎస్ దీన్ని ఉపయోగించుకోకుండా ఉంటుందా..? అయితే.. అది సినిమా… ముద్దు సీన్ కాబట్టి చర్చనీయాంశం అయింది కానీ.. ఇందులో డీగ్లామర్ ఎన్నికల సబ్జెక్ట్ కాబట్టి.. మీడియా లైట్ తీసుకుంటుంది. కానీ… రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా విలువ ఉంటుంది. ఈ లెక్కన వీహెచ్ పోస్టర్ చించేసిన అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అయింది.. ఇప్పుడు టీఆర్ఎస్ పోస్టర్ చించేశారు కాబట్టి .. టీఆర్ఎస్ కూడా సూపర్ హిట్టేనని ఆ పార్టీ నేతలు సంబరపడిపోవడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది.