వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థుల అన్వేషణలో అన్ని పార్టీలూ బిజీగా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకూ ఎవరిని నిలబెట్టినా విజయం ఖాయమని డంకా బజాయించిన కేసీఆర్ బృందం ఇప్పుడు అభ్యర్థి విషయంలో గట్టి కసరత్తే చేస్తోంది. అనుకోని ఎదురుగాలి వీయడం మొదలైందని తెరాస నేతలు గమనించారు. అందుకే, ఆర్థికంగా అత్యంత బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019 నాటికి తెలంగాణలో అధికారం కోసం పోటీ పడే పార్టీగా ఎదగాలంటే వరంగ్ లో విజయం తప్పనిసరి అని భావిస్తోంది. ఈ విజయం ఇచ్చే జోష్ తో కేడర్ బలోపేతం అవుతుందని అంచనా వేస్తోంది. అందుకే, అర్థబలం గల అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. పెద్దపల్లిలో అనూహ్యంగా ఓటమి పాలైన వివేక్ ను నిలబెడితే ఎలా ఉంటుందనేది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన అని సమాచారం.
నిజానికి, వివేక్ కు తెరాస గాలం వేసిందని, ఆయన నో అన్నారని వార్తలు వచ్చాయి. అదే వివేక్ ను బ్రహ్మాస్త్రంగా మలచి తెరాస మీదికి ప్రయోగించాలని కొందరు కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థికంగా బలవంతుడైన వివేక్ ను తట్టుకునే అభ్యర్థిని నిలబెట్టడం తెరాస వల్ల కాదని అంచనా వేస్తున్నారు. మాజీ ఎంపీగా, యువ నాయకుడిగా వివేక్ అందరికీ తెలిసిన వ్యక్తి. పైగా మీడియా బలం ఉంది. తెరాస అభ్యర్థికి సంపూర్ణంగా సహకరించే చానల్ ఒకటి ఉంది. దానికి పోటీగా అదే పనిగా వివేక్ ను ప్రమోట చేసే చానల్ మరొకటి ఉంది. ఈ రెండూ తెలంగాణలో పోటాపోటీగా పాపులారిటీ ఉన్నవే.
తెరాసకు ఏడాది క్రితం ఉన్న ఊపు లేదు. పైగా, గత 17 నెలల్లో వరంగల్ కు తెరాస ప్రభుత్వంలో ఒరిగింది ఏమీలేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. అంతే కాకుండా, ప్రభుత్వ వ్యవహార శైలిపై వ్యతిరేక ఉంది. మాటలు తప్ప చేతలు లేవన్న విమర్శ ఉంది. శంకుస్థాపన శిలాఫలకాలే తప్ప, పూర్తయిన పని ఒక్కటీ లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఈ దశలో అర్థబలం, కేడర్ ను ఉత్సాహ పరిచే కరిష్మా ఉన్న అభ్యర్థిని నిలబెట్టి సీటు గెలవాలనేది కాంగ్రెస్ ఆలోచన. వివేక్ పోటీ చేస్తే విజయం ఖాయమని డంకా బజాయించి చెప్పే నాయకులు చాలా మందే ఉన్నారు. అంతర్గత చర్చల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
మీడియా ద్వారా, ప్రయివేటు ఏజెన్సీ ద్వారా వివేక్ వరంగల్ లో సర్వే చేయించారని సమాచారం. ఆయన అభ్యర్థి అయితే విజయావకాశాలున్నాయనే రిపోర్ట్ వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో వివేక్ కూడా పోటీకి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు హైకమాండ్ సై అంటే తెరాసకు జలక్, కాంగ్రెస్ కు జోష్ ఖాయమంటున్న కాంగ్రెస్ వారి అంచనా నిజమవుతుందో లేదో వేచి చూద్దాం.