కాంగ్రెస్ లో టిక్కెట్లు ఖరారు చేయాలంటే గాంధీ భవన్ కు సెక్యూరిటీ పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేతలు ఎగతాళి చేస్తూంటారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం మారరు. తమ దారిలోనే తాము వెళ్తూంటారు. కాంగ్రెస్ లో టిక్కెట్ల ఖరారు ప్రక్రియ ప్రారంభంలోనే నేతలంతా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. గాంధీ భవన్ లో … అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియ ప్రారంభంలోనే రచ్చ అయింది. చివరికి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయవద్దని కొంత మంది నేతలు గొడవకు దిగారు. చివరికి ఎవరికి వారు అలిగి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందర్నీ గౌరవించాలన్న ఉద్దేశంతో … ప్రక్రియ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది . చివరికి అది కాంగ్రెస్ పార్టీని రోడ్డున పడేసే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ .. క్రమశిక్షణ వియంలో చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో సీన్ మారిపోతోంది . అభ్యర్థులకసరత్తు అంతా ఢిల్లీలో చేసుకుంటే సమస్య ఉండేది కాదు. కానీ ఇక్కడ నేతలంతా తలా ఓ చేయి వేయడంతో … అంతా రచ్చ రచ్చ అవుతోంది. ఎవరికి వారు తమ వర్గ నేతలకు టిక్కెట్లు ఖరారు చేయించుకోవాలని ప్రయత్నిస్తూండటంతో సమస్య వస్తోంది.
ఓ వైపు బీఆర్ఎస్ టిక్కెట్లను ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు టిక్కెట్ల దగ్గరే కుస్తీలు పడితే ఇక కలిసి ఎన్నికలు చేయడం మాత్రం అసాధ్యమే. ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా…. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. తమ వ్యక్తిగత ఎజెండాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ… ఇతర పార్టీలకు మేలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎగతాళి చేస్తున్నట్లుగా.. టిక్కెట్లు ఖరారు చేస్తే గాంధీభవన్ పై దాడులు జరగడం ఖాయమే.. లేకపోతే… గట్టి సెక్యూరిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది.