కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంచాయతీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి వద్దకుచేరుతోంది. ఎమ్మెల్యేలను తన పామ్ హౌస్ కు ఆహ్వానించి సమావేశం పెట్టి కలకలం రేపిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాను దీపాదాస్ మున్షిని కలిసి అన్ని వివరాలు వెల్లడిస్తానని అంటున్నారు. రెవిన్యూ మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగానే అందరూ సమావేశమయ్యారని చెప్పుకున్నారు. అయితే నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మాత్రం జడ్చర్ల ఎమ్మెల్యేకు చెందిన ఓ ఫైల్ ను రెవిన్యూ మంత్రి క్లియర్ చేయలేదని అందుకే ఆయన ఈ పనులు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై అనిరుధ్ రెడ్డి స్పందించారు. తాను రెవిన్యూ మంత్రి వద్ద ఎటువంటి ఫైల్ పెట్టలేదన్నారు. పార్టీలో కనీస గౌరవం కూడా ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పది మంది ఎమ్మెల్యేలకు తన ఫామ్ హౌస్ లో విందు ఇచ్చాను కానీ అతి రహస్య సమావేశం కాదని.. అనిరుధ్ రెడ్డి చెబుతున్నారు . ఆయనకు దీపాదాస్ మున్షి ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఈ అంశంపై ఆమెతో అనిరుధ్ మాట్లాడే అవకాశం ఉంది.
తాము గ్రూపులు కట్టడానికి సమావేశం కాలేదని.. సమస్యలు చర్చించుకోవడానికే సమావేశమయ్యామని అంటున్నారు. అనిరుధ్ పై మల్లు రవి ఆరోపణలు చేయడం.. మళ్లీ దానికి ఆయన కౌంటర్ ఇవ్వడంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. పలు రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేల అంశం మరో సమస్యగా మారింది. వీరి వెనుక ఏదైనా పార్టీ ఉంటే మాత్రం భవిష్యత్ లో మరింత జోరుగా రాజకీయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.