“ఏడాదికి కోటి ఉద్యోగాలన్నారు…! ఎక్కడిచ్చారు..?”
వల్లభాయ్ పటేల్ ను ప్రధాని కాకుండా నెహ్రూ అడ్డుకున్నారు. ఆయనను అవమానించారు..!
” బ్లాక్ మనీ తెచ్చి రూ. 15 లక్షలు ఇస్తామన్నారు. ఎప్పుడిస్తారు..”
కాంగ్రెస్ పార్టీ అంజయ్యను అవమానించింది. కాంగ్రెస్కు గర్వం..!
“జీఎస్టీ, నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.. దేశానికి వచ్చిన లాభం ఏమిటో చెప్పండి..”
అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజల్ని అవమానించింది. తల్లీకొడుకులు బెయిల్ మీద ఉన్నారు….
“క్రూడాయిల్ ధరలు తగ్గినా రేట్లు ఎందుకు తగ్గించడం లేదు..?”
సీతారామ్ కేసరిని కాంగ్రెస్ అధ్యక్ష పదవి అవమానకరంగా తొలగించింది. పీవీని అవమానించింది.
ప్రశ్నలకు…సమాధానాలకు ఏమైనా పొంతన ఉందా..? ఉండదు.. అసలు ఉండదు. ఎందుకంటే.. ఆ ప్రశ్నలన్నీ సామాన్యుల దగ్గర నుంచి వస్తే .. సమాధానాలన్నీ మోడీ దగ్గర నుంచి వస్తాయి. ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో… ఏం చేశారో చెప్పుకోలేక.. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గుర్తు చేస్తూ.. దశాబ్దాల కిందట కాంగ్రెస్ అలా.. ఎవర్నో… అవమానించిందని చెప్పుకుంటూ… రాజకీయం చేస్తున్నారు నరేంద్రమోడీ. ఆంధ్రప్రదేశ్లోనూ అదే అస్త్రం ప్రయోగించబోతున్నారని… తమిళనాడు బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడి టీజర్ రిలీజ్ చేశారు.
ఆదివారం.. తమిళనాడు కార్యకర్తలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీకి వచ్చి తానేం చెప్పబోతున్నారో చెప్పకనే చెప్పారు. సందర్భం లేకపోయినా.. ఎన్టీఆర్ గురించి తమిళనాడు బీజేపీ కార్యకర్తల దగ్గర ప్రస్తావించారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలవడాన్నే ఆయన హైలెట్ చేసి ప్రజల్లో భావోద్వేగం రేపే ప్రయత్నం చేయబోతున్నారని.. తేలిపోతోంది. నిజానికి మోదీ ఇలాంటి విషయాలకే ప్రాధాన్యం ఇస్తారు. దేశంలో ఎక్కడ ఎన్నికల ర్యాలీలు జరిగినా.. చరిత్రలో.. ఫలానా వాళ్లను కాంగ్రెస్ అవమానించిందని… చెప్పుకొస్తారు. అందులో వక్రీకరణలు ఉంటాయి… అతిశయోక్తులు ఉంటాయి. దశాబ్దాల కిందట కాంగ్రెస్ ఏం చేసిందో ఇప్పుడు ప్రజలకు అవసరమా..? అన్న విషయం ఆయనకు పట్టింపు ఉండదు. తమ ప్రభుత్వం ఘనకార్యలను.. ఆయన ప్రస్తావించరు. తనకు మాత్రమే సాధ్యమయ్యే హావభావాలతో.. గతంలో కాంగ్రెస్ ఏదో చేసిందన్న భావన తెప్పించి.. వ్యతిరేకత పెంచి.. తన పార్టీకి.. తనకు ఓట్లు వేయించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇప్పటి వరకూ జరిగింది అదే.
విజయాలు వచ్చినంత కాలం.. ఆయన స్టైల్ బాగుందని బీజే్పీ నేతలు అనుకున్నారు. అయితే.. ఇప్పుడు మోదీ ప్రచారం చేసిన చోటల్లా బీజేపీ ఓడిపోతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో 70 శాతం ఓడిపోయింది. అయినా ఏపీలోనూ అదే పద్దతి ఫాలో అయితే.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ పెట్టారని..ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు తుంగలో తొక్కారని.. బాధపడిపోయే అవకాశం ఉంది. నిజానికి తన జీవితంలో ఎప్పుడూ ఎన్టీఆర్ ను మోదీ .. కాస్త సానుకూలంగా తలుచుకోని ఉండరు. కానీ రేపు ఆరో తేదీన రాజకీయం కోసం తల్చుకుంటారు. ఏపీకి చేసిన అన్యాయాన్ని ఆ పద్దతిలో మరుగుపర్చే ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.