తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంటోందనే అభిప్రాయం తీసుకొచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలంగాణ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ బస్సుయాత్ర దిగ్విజయం అవుతోందనీ, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనీ ఆయనే చాటి చెబుతూ వచ్చారు. తెరాసకు ప్రత్యామ్నాయం తామేననీ, వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే, ఉత్తమ్ ప్రకటనలు, పనితీరుపై ఆ పార్టీ వర్గాల నుంచి ఓ భిన్నమైన విమర్శ మొదలైనట్టు తెలుస్తోంది. ఉత్తమ నాయకత్వ లక్షణాలన్నీ తననితాను నాయకుడిగా నిరూపించుకునేందుకు ఉపయోగపడుతున్నాయనీ, దూరదృష్టితో ఆలోచిస్తే ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడిపించే వ్యూహాత్మకత ఆయన పనితీరులో లేదనే అభిప్రాయం అక్కడక్కడా వినిపిస్తోంది!
దాదాపు వంద స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేస్తున్నా… రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ తెరాసకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో లేరనేది పీసీసీ అధ్యక్షుడు పరిగణనలోకి తీసుకోవడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలోని కనీసం సగం అసెంబ్లీ స్థానాల్లో నాయకత్వలేమితో పార్టీ కొట్టుమిట్టాడుతోందని, కేవలం కాంగ్రెస్ బలంగా ఉన్న కొన్ని నియోజక వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే ఉత్తమ్ పరిమితం అవుతున్నారనే గుసగుస వినిపిస్తోంది. బస్సు యాత్ర భారీ సక్సెస్ అని ఉత్తమ్ చాటి చెబుతున్నా… కాంగ్రెస్ బలంగా నియోజక వర్గాల్లో మాత్రమే ఆ యాత్ర సాగిందనీ, తెరాస బలంగా ఉన్న ప్రాంతాలపై ఆయన దృష్టి సారించడం లేదనే విమర్శ వినిపిస్తోంది.
హైదరాబాద్ లో సగానికిపైగా నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కు పట్టులేదనీ, కనీసం రాజధానిపైన అయినా పీసీసీ అధ్యక్షుడు దృష్టి సారించడం లేదన్న విమర్శా ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తూ ఉండటం విశేషం. తెరాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తున్నా… ప్రభుత్వ వ్యతిరేకతను అందింపుచ్చుకునేందుకు పార్టీ సంసిద్ధంగా, వ్యూహాత్మకంగా లేదనేది కొందరి మాట. ఉత్తమ్ మాటల్లో కాంగ్రెస్ బలంగా వినిపిస్తోందిగానీ, క్షేత్రస్థాయిలో అంతే బలంగా కనిపించే ప్రయత్నం ఆయన చేయడం లేదనే విమర్శ మొదలైంది. అసలే, కాంగ్రెస్ పార్టీ కదా…! దాదాపు డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులున్న పార్టీ! ఉత్తమ్ పనితీరుపై ఇలాంటి విశ్లేషణ మొదలైందని తెలిస్తే… కొంతమంది ఢిల్లీకి ఫ్లైట్ టిక్కెట్లు వేసే పనిలో ఉండరా..?