ఖమ్మం జిల్లా రాజకీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ నడుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయకుల మధ్య సయోధ్య చాలా కష్టం. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తుమ్మల, పొంగులేటి, పువ్వాడ వర్గాలుగా పార్టీలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కాంగ్రెస్ లో రిపీట్ అవుతోంది.
కాంగ్రెస్ పాలనలో ఖమ్మంలో భట్టి, తుమ్మల, పొంగులేటి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. భట్టి ముందు నుండి ఉన్నా, పొంగులేటికి మంచి ప్రియారిటీయే ఉంది. ఎన్నికల సమయంలో ఆర్థిక వనరులు సమకూర్చారని, అందుకే ఇప్పుడు తనకు ప్రియారిటీ ఉందన్న చర్చ సాగుతోంది. తుమ్మల, పొంగులేటి కూడా కలిసిపోయినట్లే కనిపించారు.
కానీ, లోక్ సభ ఎన్నికలు ఖమ్మం కాంగ్రెస్ లో గ్రూపుల రచ్చను బయటకు తెచ్చాయి. ఖమ్మం సీటు పక్కా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఖమ్మం సీటు కోసం పొంగులేటి, భట్టి హోరాహోరీగా తలపడుతున్నారు. సోదరుడి కోసం పొంగులేటి, భార్య కోసం భట్టి ఎవరూ తగ్గటం లేదు. దీంతో ఈ పంచాయితీ ఏఐసీసీ ప్రెసిడెంట్ వద్దకు చేరింది. అయినా, నో యూజ్. మధ్యే మార్గంగా భట్టి రాయల నాగేశ్వర్ రావుకు టికెట్ ఇస్తే ఓకే అన్నట్లు తెలుస్తోంది. కానీ, పొంగులేటి తన సోదరుడికే అని భీష్మించుకున్నారు. దీంతో మధ్యే మార్గంగా ఖర్గే తుమ్మల అభిప్రాయం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో పొంగులేటి, తుమ్మల మధ్య ఉన్న వైరం అంతా ఇంతా కాదు. ఓకే పార్టీలో ఉండి, ఎదురుపడ్డా మాట్లాడుకునే వారు కాదు. పైగా భట్టి వల్లే తనకు రాజకీయ పునర్జన్మ వచ్చిందంటూ ఇటీవల తుమ్మల చాలాసార్లు చెప్పారు. దీంతో తుమ్మల భట్టికి మద్దతిస్తే పొంగులేటికి చెక్ పెట్టినట్లే. పోనీ పొంగులేటికి మద్ధతిస్తే భట్టితో లొల్లి మొదలైనట్లే.
దీంతో, పార్టీ ఎంత బలంగా ఉన్నా ఖమ్మంలో ఈ గ్రూపుల లొల్లి తప్పేలా లేదు అన్న అసంతృప్తి క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.