కాంగ్రెస్ అంటే నలుగురు వ్యక్తులు నాలుగు వైపులా కలిసి లాగుతూంటారు. ఎవరికి ఏ ముక్క దొరికితే దాంతో పండగ చేసుకంటారు. అంతిమంగా కాంగ్రెస్ మాత్రం చీలిక పీలికలవుతుంది. మరోసారి తెలంగాణ కాంగ్రెస్ లో అదే జరిగింది. సీనియర్లు అంతా తమ పంతమే నెగ్గాలని ఎవరికి వారు పట్టుదలకు పోవడంతో అసలు వ్యవహారం పూర్తిగా ఆగిపోయింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి, హైదరాబాద్ కు మధ్య పరుగులు పెట్టారు. రేవంత్ రెడ్డి గత వారంలో నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు.అగ్రనేతలందరితో సమావేశం అయ్యారు. ఇంత కసరత్తు చేసిన తర్వాత కూడా టీ పీసీసీ చీఫ్ ను ప్రకటించలేకపోయారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవుల్ని భర్తీ చేయలేక విస్తరణను వాయిదా వేసుకున్నారు. మరో వైపు దామోదర రాజనర్సింహ.. రెండు పేర్లు ప్రకటించేశారు. సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ లో అలజడి రేగింది. అసలు ఓ మంత్రికి సంబంధం లేని కేబినెట్ విస్తరణపై ఆయన ప్రకటన చేయడమే ఇక్కడ అసలు టాపిక్.
కాంగ్రెస్ లో అంతేనని పార్టీ నేతలు సర్దుకుపోతున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తేలడం లేదు. ఎన్నికలకు ముందు కొంత మందికి నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఇప్పటికీ జీవో రిలీజ్ చేయలేదు. వాటికే అధికారిక హోదా ఇవ్వకపోతే కొత్తవి ఎప్పుడు భర్తీ చేస్తారోనని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నాయి కానీ.. కష్టపడిన దానికి ఫలం మాత్రం దక్కడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఫీలవుతున్నారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతే అని ఆ పార్టీ నేతలు సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.