తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర ప్రారంభమయింది. ఓటమికి బాధ్యత తీసుకోవాలని రాహుల్ గాంధీ.. రాజీనామా చేసి.. చూపించినా.. రాష్ట్రాల్లోని నాయకులు మాత్రం… పదవులు వదులుకోవడానికి సిద్ధపడటం లేదు. దాంతో రాహుల్ గాంధీ… తన రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు. రాహుల్ ఇంటెన్షన్ గురించి తెలుసుకున్న నేతలు.. ఒక్కొక్కరుగా పదవులకు రాజీనామా చేస్తున్నారు. హర్యానా,చత్తీస్ ఘడ్ పీసీసీ అధ్యక్షుడు రాజీనామాలు చేసేశారు. ఉత్తరాదిలో ఈ రాజీనామాల పరంపర ప్రారంభమయింది. దాదాపుగా ప్రతి ఒక్కరూ రాజీనామా చేయాలన్నట్లుగా రాహుల్ గాంధీ నుంచి పరోక్ష సందేశాలు వెళ్తున్నాయి. చేయాలనుకున్న వాళ్లు చేస్తున్నారు. తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.
ముందస్తుగా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను.. కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. వారు రాజీనామా చేస్తున్నారు. అయితే.. అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఘోరపరాజయాలు ఎదురైనా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం… కదలడం లేదు. ఆయన కూడా ఓటమికి బాధ్యత తీసుకోవాలనేదే.. హైకమాండ్ ఆలోచన. పార్టీ ఓడిపోయిన ప్రతీ రాష్ట్రంలోనూ… ఓటమికి బాధ్యత తీసుకోవాలని.. రాహుల్ గాంధీ క్యాంప్.. చెబుతోంది. అయితే ఉత్తమ్ మాత్రం.. రాజీనామాకు ససేమిరా అంటున్నారు. పైగా.. కుంతియా లాంటి వాళ్లతో.. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కొనసాగుతారనే ప్రకటనలు చేయిస్తున్నారు. దీంతో.. కాంగ్రెస్ హైకమాండ్.. తెలంగాణపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉండటం లేదు.
నిన్న పొన్నం.. ఈ రోజు రేవంత్ పదవుల్ని వదులుకున్నారు. రాహుల్ గాంధీ బాటలోనే తాము నడుస్తున్నామని ప్రకటించారు. ఇంకా కొన్ని రాజీనామాలు ఉండే అవకాశం ఉంది. అయితే.. అందరి చూపూ ఉత్తమ్ వైపే ఉంది. ఆయన రాజీనామా చేస్తే… కాంగ్రెస్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ సందేశాలు… ఉత్తమ్ కు చేరలేదా.. లేక చేరినా.. తెలియనట్లు ఉంటున్నారా..? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.