తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ జాడ్యం ఇప్పట్లో వదిలేట్టు లేదు! అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైనా, పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలపై పెద్దగా అంచనాలు లేకపోయినా, పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నా అదేదో తమ బాధ్యత కాదన్నట్టుగా కొంతమంది కాంగ్రెస్ నాయకుల తీరు ఉంటోందన్న చర్చ ఆ పార్టీ కేడర్ నుంచి వినిపిస్తోంది. ఒకరో ఇద్దరో నేతల తప్ప… పార్టీని పటిష్టంగా ఉంచుకుందామనే పట్టుదల ఇతరుల్లో కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. సీఎల్పీ విలీనానికి తెరాస ప్రయత్నిస్తుంటే… దాన్ని అడ్డుకోవడం కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు క్షేత్రస్థాయిలో మంచి స్పందనే వస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎక్కడిక్కడ కార్యకర్తలు నిలదిస్తూ, రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ యాత్రలో భట్టికి తోడుగా ఇతర కాంగ్రెస్ నాయకులెవ్వరూ కలిసి రావడం లేదు. రమ్మంటా భట్టి ఆహ్వానిస్తున్నా కూడా… వారి సొంత పనులకే పరిమితం అవుతున్నారట! నిజానికి, ఆయన ఈ యాత్ర ప్రారంభించిన రోజున కూడా పార్టీ ప్రముఖ నాయకులెవ్వరూ హాజరు కాలేదు. దీంతో చేసేందేం లేక… ఆయనే సొంతంగా యాత్రను నెట్టుకొచ్చిన పరిస్థితి. దాదాపుగా ఇదే పరిస్థితిని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారం ఎంత చర్చనీయమైందో తెలిసిందే. ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద పోరాటం చేయాలని రేవంత్ రెడ్డి భావించారు. కాంగ్రెస్ నేతలంతా రోడ్ల మీదికి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేశారట! కానీ, దీనికి కూడా నేతల్లో ఉత్సాహం కనిపించలేదట! ఎవరికివారు సొంతంగా మీడియా ముందు ఖండనలు, విమర్శలు చేసి మమ అనిపించేశారు.
అయినాసరే, గాంధీభవన్ దగ్గర రెండురోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ సిద్ధమయ్యారు. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కూడా యథావిధిగా నేతల గైర్హాజరీ ఉంది. దీంతో ఒకటిన్నర రోజుకే ఈ దీక్షను రేవంత్ విరమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రెండు ఘటనలతో కాంగ్రెస్ కేడర్ లో ఓ చర్చ మొదలైందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసుకుని, తెరాసను నిలదీసేందుకు వచ్చే అవకాశాలు నాయకులు ఎందుకిలా వృథా చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా, రాష్ట్ర కాంగ్రెస్ కి నాయకత్వ మార్పు అవసరం అనేది స్పష్టమౌతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జరిగేది అదే అనే కథనాలు ఇప్పటికే ఉన్నాయి. అది జరిగాకైనా టి. కాంగ్రెస్ నాయకుల్లో ఐకమత్యం వస్తుందేమో చూడాలి.