తెలంగాణలో అధికారం చేపట్టడమే తరువా అన్నంత ఉత్సాహంగా పదో తేదీ వరకూ గడిపిన కాంగ్రెస్ నేతలకు.. ఇప్పుడు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… గెలుపోటములకు మొత్తం తనదే బాధ్యతని ప్రకటించుకున్నారు. ఓడిపోతే.. గాంధీభవన్ వైపు రానని చాలెంజ్ చేశారు. అయితే అలాంటి చాలెంజ్ ఏమీ చేయలేదని తర్వాత కొంత మందికి చెప్పినట్లు ప్రచారం జరిగింది. అలాగే… తన నియోజకవర్గం హుజూర్ నగర్ లో యాభై వేలు మెజార్టీ తెచ్చుకుంటానని కూడా సవాల్ చేశారు. కానీ.. స్వల్ప తేడాతో బయటపడ్డారు. ఈ కారణాలతో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు అందరి దృష్టి పడింది. ఆయన ముందుగా సవాల్ చేసినా.. చేయకపోయినా సరే.. నైతిక బాధ్యత తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది.
వాస్తవానికి ఇప్పటికిప్పుడు టీ పీసీసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. పంచాయతీ, స్థానిక సంస్థలు, సహకార, మున్సిపాల్టీ ఎన్నికలు వరుసగా నిర్వహించాలని అనుకుంటున్నారు. అవి కూడా… పార్లమెంట్ ఎన్నికలలోపే .. ఇప్పుడు ఉన్న విజయోత్సాహంలోనే పూర్తి చేయాలనుకుంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా టీ కాంగ్రెస్ కు రిపేరు చేస్తే తప్ప తెలంగాణ నుంచి కొన్ని లోక్ సభ సీట్లు ఆశించవచ్చని అంచనా వేస్తున్నారు.
ఉత్తమ్ రాజీనామా చేసినా లేక అధిష్టానం ఆయనను మార్చినా తర్వాత పీసీసీ అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ కూడా ఇప్పటికే పార్టీలో జరుగుతోంది. ప్రజా తీర్పులో కొట్టుకుపోయిన నేతలెవరు ఇప్పుడు పదవి కావాలని ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గెలిచిన వారిలో క్రౌడ్ పుల్లర్స్ కూడా ఎవరూ లేరు. పీసీసీ అధ్యక్షుడ్ని మారిస్తే… కొత్తగా పగ్గాలు చేపట్టే వాడి ముందు అతి పెద్ద సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు ఉండబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకుని, లోక్ సభ ఎన్నికల సమరంలో అన్నీ హంగులతో రంగంలోకి దిగేలా సిద్ధం చేయాల్సిన బృహత్తర బాధ్యత కొత్త పీసీసీ అధ్యక్షునిపై ఉంటుంది. ఘోర వైఫల్యం నుంచి తిరిగి కోలుకుని పార్టీని ట్రాక్ మీదకు తేగలిగే మొనగాడు ఎవరు అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. సిట్టింగ్ లలో ఉత్తమ్, భట్టీ విక్రమార్కలు మాత్రమే గెలిచారు. ఉత్తమ్ ఎమ్మెల్యేగా గెలిచినా పీసీసీ చీఫ్ గా పార్టీని గెలిపించలేకపోయారు. భట్టీ గెలిచినప్పటికీ… పీసీసీ చీఫ్ పోస్టుతో సమానంగా పార్టీ ఓటమికి బాధ్యతవహించాల్సి ఉంటుంది. ఎందుకంటే…ఈ ఎన్నికల్లో ఆయనే ప్రచార కమిటీ సారథిగా వ్యవహరించారు.
వీరిద్దరినీ మినహాయిస్తే… పీసీసీ పదవి చేపట్టగలిగే స్థాయి ఉన్న నాయకుడు ఎవరు అన్నది తేల్చుకోవాల్సిన విషయం. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తినే పీసీసీ అధ్యక్షుడుగా చేయాల్సి వస్తే… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎమ్మెల్యేగా గెలవకపోయినా దూకుడైన నేతలను పీసీసీ చీఫ్ గా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి, డీకే అరుణలలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ తెలంగాణలో ఆయనకు ఇమేజ్ ఉంది. ఆయనను బలంగా అభిమానించే వర్గం ఉంది. కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కుంటారనే పేరుంది. ఈ ఎన్నికల్లో సీనియర్ల ఓటమితో ఓ జనరేషన్ పొలిటికల్ కెరీర్ ముగిసినట్టైంది. బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకుని వచ్చే తరం నాయకులకు భరోసా ఇచ్చుకోవాల్సిన సందర్భం ఇది. రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ కు అవకాశం ఇస్తే… నెక్ట్స్ టీంను రెడీ చేసుకునే అవకాశం ఉంటుంది. డీకే అరుణకు ఛాన్స్ ఇస్తే ఓ మహిళకు ఇచ్చారన్న పేరు ఉంటుంది. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి యువరక్తం ఎక్కించే పనిలో ఉన్నారు కాబట్టి.. మార్పులు ఖాయమనే అంచనాలు ఉన్నాయి.