తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ కి 2019 ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో పొత్తు ఉండదని ఖరారు అయినప్పటి నుండి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్తుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంతో మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడిపోయినా, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, చింతా మోహన్, రఘువీరారెడ్డి, పల్లం రాజు లాంటి నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ పరిస్థితి దీంతో అగమ్యగోచరంగా మారింది.
2014లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు . పైగా బొత్స, కన్నా లక్ష్మీనారాయణ తప్ప మిగతా అందరూ మిగతా అందరూ నేతలు డిపాజిట్లు కోల్పోయారు. ఈసారి ఎన్నికల్లో ఫలితాలు కూడా ఆశాజనకంగా వచ్చే పరిస్థితి ఎంత మాత్రము లేదు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీతో కానీ, వైఎస్ఆర్సిపి తో కానీ ఆఖరి నిమిషంలో పొత్తు కుదిరితే, ఆ పొత్తులో భాగంగా తమ సీటు తమకు దక్కితే గెలిచేసి రాజకీయం చేద్దామన్న ఆలోచన తో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉండి పోయిన కాంగ్రెస్ నేతల పరిస్థితి దారుణంగా మారింది. ఒంటరి పోరు చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో ఇప్పటికిప్పుడు కార్యాచరణ రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయారు ఈ కాంగ్రెస్ నేతలు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరే సమయానికి , కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు ఏర్పడుతుందన్న అంతర్గత సమాచారం ఉంది. అధికార పార్టీతో పొత్తు కుదిరితే కిరణ్ కుమార్ రెడ్డి సైతం రాజంపేట నుంచి గాని మరి ఇంకేదైనా స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన స్థాయి కావడంతో, అప్పట్లో తనతో సన్నిహితంగా ఉన్న మరికొంతమంది కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తిరిగి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకొని వస్తాడని భావించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ లో చేరి నెలలు గడిచినా, కొత్తగా పార్టీలోకి నాయకులను ఆయన తీసుకు వచ్చింది కానీ, పార్టీని ఆయన బలోపేతం చేసింది కానీ ఏమీ లేదు. పైపెచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో గాని మరే ఇతర పార్టీతోనే పొత్తు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు తెచ్చుకుంటాడా అన్నది సందేహమే.
ఇక మాజీ ఎంపీ చింతామోహన్ ది మరొక రకమైన విచిత్ర పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ, ముద్రగడ పద్మనాభం లాంటి నేతల తో సన్నిహితంగా మెలుగుతూ కనిపించాడు. దీంతో ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరుతాడేమోనని వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదరగానే అప్పటివరకు చంద్రబాబు నాయుడు పాలనని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన చింతామోహన్ సడన్ గా యూటర్న్ తీసుకుని చంద్రబాబు నాయుడు ని పొగడటం మొదలుపెట్టాడు. 2014లో కూడా టిడిపి పార్టీ, పొత్తులో భాగంగా తిరుపతి సీటు ని బిజెపికి కేటాయించడంతో, ఈసారి పొత్తు కుదిరితే కాంగ్రెస్ పార్టీ తరపున తాను టికెట్ దక్కించుకోవచ్చని భావించారు. అయితే టిడిపి కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉండదని తేలడంతో ఈ రోజు మళ్ళీ మాట మార్చి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరితే బాగుంటుందని ప్రకటనలు ఇస్తున్నారు.
ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి నేతలు తమ దారి తాము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలోనూ టిడిపి నుంచి ఆహ్వానం వచ్చినప్పటికీ అప్పట్లో కాస్త బెట్టు చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే పళ్ళంరాజు వంటి సీనియర్ నేతలు ఇప్పటికీ గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారనే దాని మీద స్పష్టత లేదు.
ఏది ఏమైనా ఒంటరిపోరు ఖాయం కావడంతో మిగిలిన ఆ నలుగురు ఐదుగురు నాయకులు కూడా త్వరలోనే తమ దారి తాము చూసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
– జురాన్ ( CriticZuran)