తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోదండరామ్ టెన్షన్ కొంత మొదలైందని చెప్పాలి! ఆయన పనేదో ఆయనది కదా, మధ్యలో కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బందేముంటుంది అనేగా సందేహం..? కొలువుల కొట్లాట పేరుతో ఆయన భారీ సభను నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలనూ ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతల్ని కూడా పిలిచారు. ఈ సభ తరువాత టీజేయేసీ ఎలా పరిణామం చెందుతుందనే ఆసక్తి సర్వత్రా ఉంది. జేయేసీని రాజకీయ పార్టీగా మారుస్తారనే అభిప్రాయం మళ్లీ ఇప్పుడు కాస్త బలంగానే వినిపిస్తోంది. కేసీఆర్ ను ఎదుర్కొనే శక్తిగా కోదండరామ్ ను కొంతమంది వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారట! ప్రస్తుతానికి లేదని అంటున్నా.. ఎన్నికల దగ్గరపడేనాటికి టీ జాక్ కొత్త రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, తెలంగాణలోని తాజా పరిణామాలన్నింటిపైనా ఓ సమగ్ర నివేదికను టి. కాంగ్రెస్ తయారు చేసి రాహుల్ కి పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ నివేదికలో కొన్ని అంశాలను రాహుల్ కు స్పష్టంగా తెలిపినట్టు సమాచారం. వాటిల్లో ఒకటీ.. పొత్తుల వ్యవహారం. తెలంగాణలో అధికార తెరాసతో పాటు తెలుగుదేశం, భాజపా కూడా కలుస్తుందని సదరు నివేదికలో పేర్కొన్నారట. ఆ మేరకు మూడు పార్టీల మధ్య చర్చలు కూడా జరిగిపోయినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు కూడా సమాచారం. ఈ మూడు పార్టీల కూటమిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కు ఇతర శక్తులు తోడు కావాల్సి ఉంటుందనీ, ఆ దిశగా ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలని కూడా నివేదించారట. అయితే, ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకం చేయాల్సిన బాధ్యతను అప్రకటితంగా కాంగ్రెస్ నేతలు నెత్తిన వేసుకున్నారు కదా. కానీ, ఇంకోపక్క ఇదే పని కోదండరామ్ చేసేస్తున్నారు. కొలువుల కొట్లాట పేరుతో ఆయన చేస్తున్నది ఇదే కదా. అన్ని పార్టీల నేతల్నీ సాయం కోరుతున్నారు. చివరిని జన సమీకరణ విషయంలో కూడా ఇతర పార్టీలపైనే కోదండరామ్ ఆధారపడుతున్నారు. సో.. ఇవన్నీ టి. కాంగ్రెస్ కు కాస్త కలవరపెట్టే పరిణామాలే.
కొలువుల కొట్లాట సభ ద్వారా తెరాస వ్యతిరేక రాజకీయ పార్టీలన్నింటికీ ఒక వేదికపైకి తొలిసారిగా తెస్తున్నది కోదండరామ్. రాజకీయ శక్తుల ఏకీకరణలో పెద్దన్న పాత్ర పోషించాలని కాంగ్రెస్ ఆశించింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కంటే ముందుగా టీ జాక్ వెళ్తోంది. సో.. ఈ నేపథ్యంలో టి. కాంగ్రెస్ కి కొంత టెన్షన్ పట్టుకుందనే చెప్పాలి. ఇదే విషయం రాహుల్ కు కూడా తెలియజేశారనే ప్రచారం జరుగుతోంది. అవసరం అనుకుంటే కోదండరామ్ ను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు కొంతమంది నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మరి, ఈ సమీకరణాలు మున్ముందు ఎలా మారతాయో వేచి చూడాల్సిందే.