ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే అదే సమయంలో సీఐడీ అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఇతర పార్టీల నేతల్ని ఎలా వేధించిందో.. ఒక్కొక్క వ్యవహారం బయటకు వస్తోంది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీని కూడా వదలి పెట్టలేదు. కరోనా సమయంలో…. ఏపీలో వైద్యులకు సరైన పీపీఈ కిట్లు, గ్లౌజులు కూడా ఇవ్వలేదని దుమారం రేగింది. డాక్టర్ సుధాకర్ అంశం హైలెట్ అయినప్పుడు టీవీల్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి.. డాక్టర్ కూడా అయిన గాంగాధర్ అనే నేత.. ఓ టీవీచానల్ చర్చలో తన అభిప్రాయాలు చెప్పారు. అయితే.. ఆ ప్రోగ్రాం అయిపోయిన రెండు, మూడు నెలల తర్వాత సీఐడీ ఆయనపై కేసు పెట్టింది. నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన తప్పేమిటంటే.. ప్రభుత్వాన్ని విమర్శించడమట.
గాంగాధర్ పై కేసు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ప్రభుత్వంలోని పెద్దల మెప్పు మేరకు సీఐడీ పోలీసులు చట్టాలను ఉల్లంఘించి వేధింపులకు పాల్పడుతున్నారని.. మండిపడిన ఆ పార్టీ పీసీసీ చీఫ్ శైలజానాథ్.. మొత్తం తీరును వివరిస్తూ.. హైకోర్టుకు లేఖ రాశారు. హైకోర్టు.. మొత్తం వివరాలను తీసుకోవాలని లీగల్ సర్వీసెస్ అధారిటీని ఆదేశించింది. ప్రస్తుతం.. ఈ అంశంలో లీగల్ సర్వీసెస్ అధారిటీ విచారణ జరుపుతోంది. విజయవాడ కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లిన లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధులు వారి వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. వారి దగ్గర ఉన్న సమాచారాన్ని కోర్టు ప్రతినిధులకు ఇచ్చారు.
కరోనా సమయంలో వైద్యులకు రక్షణ చర్యలు లేవని చాలా మంది చెప్పారని.. కాంగ్రెస్ నేత గంగాధర్ డాక్టర్ హోదాలో తన అభిప్రాయం చెప్పారని శైలజానాథ్ అంటున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని .. ప్రజలు, న్యాయం, ధర్మం కోసం కాంగ్రెస్ ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నిజానికి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే.. కొంత మందిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం ద్వారా మిగతా వారు నోరెత్తకుండా చేయాలనే ప్రణాళికలను రాజకీయంగా చేస్తూ.. సీఐడీని పావుగా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో సీఐడీకి కోర్టు నుంచి చీవాట్లు వస్తున్నాయి. గంగాధర్ పై కేసు విషయంలోనూ సీఐడీకి చిక్కులు తప్పవని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.