ఈ ఏడాది మే నెలలోగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. దాని కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. తమిళనాడులో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు లేకపోతే ఎంతపెద్ద జాతీయపార్టీకయినా ఓట్లు రాలవు కనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రాష్ట్రంలో తమతో కలిసివచ్చే పార్టీల కోసం వెతకడం మొదలుపెట్టారు. జయలలిత నేతృత్వంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడిఎంకె పార్టీ క్రమంగా బీజేపీకి దగ్గరవుతున్నందున దానితో జతకట్టే అవకాశం లేదు. కాంగ్రెస్ తో జతకట్టేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డిఎంకె సిద్దంగానే ఉంది. కానీ గత ఎన్నికలలో ఆ పార్టీతో జతకట్టినా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రయోజనం కలుగలేదు. కనుక ఈసారి దానిపై అంత ఆసక్తి చూపడం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితులలో దానితోనే జతకట్టినా ఆశ్చర్యం లేదు.
ఎన్నికల పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి నిన్న తమిళనాడు కాంగ్రెస్ నేతలతో డిల్లీలో సమావేశమయ్యారు. వారు ఆయనకు రకరకాల సలహాలు, సూచనలు చేసారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాకూటమి ఏర్పాటు చేసి విజయం సాధించినట్లుగానే తమిళనాడు ఎన్నికలలో కూడా తమతో కలిసివచ్చే పార్టీలతో మహాకూటమి ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాహుల్ గాంధి సూచించారు.
అనంతరం రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఈ.కె.వి.ఎస్.ఇలంగోవన్ మీడియాతో మాట్లాడుతూ తమతో కలిసివచ్చే పార్టీలతో కలిసి ఈ ఎన్నికలలో పోటీ చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా తమిళనాడులో ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా తనంతట తానుగా అధికారంలోకి రాలేకపోయింది. ఒకవేళ అధికార అన్నాడిఎంకె పార్టీ-బీజేపీలు చేతులు కలిపినట్లయితే, కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో కూడా మహాకూటమి ఏర్పాటు చేసినప్పటికీ విజయావకాశాలు ఉండకపోవచ్చును.