ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెనుకబడిపోయారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా జరుగుతున్న పోరులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. ఏకపక్షంగా విజయం లభించలేదు కానీ..ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో ఆయన గెలిచే అవకాశం ఉంది. కౌంటింగ్ ఇంకా సాగుతోది. ఫలితం ఎలాగన్నా కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష మద్దతు రాలేదనేది నిజం. ఇలాంటి పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించి ఉండదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా.
కాంగ్రెస్ సిట్టింగ్ సీటు
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో పట్టభద్రులు అంతా ఓటు వేశారు. రెండున్నర లక్షల మంది అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారు అంటే.. ప్రభుత్వ పాలనపై ఓ రకమైన అభిప్రాయం చెప్పడమే అనుకోవచ్చు. పైగా ఈ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరేళ్ల క్రితం.. కాంగ్రెస్ విపక్షంలోనే ఉన్నప్పుడు గెలిచారు. కానీ ఇప్పుడు ఆ గెలుపును అధికారంలో ఉండి దక్కించుకోకపోవడం సమస్యే.
ప్రసన్న హరికృష్ణను నిలువరించలేకపోవడం సమస్య
కాంగ్రెస్ తరపున చాలా మంది టిక్కెట్లు ఆశించారు. వారిలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా ఒకరు. విద్యారంగంలో మంచి పేరు ఉన్న ఆయన కే టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. అయితే చివరికి నరేందర్ రెడ్డిని ఖరారు చేయడంతో ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ తరపున బరిలో నిలిచారు. ఆయన కోసం బీఆర్ఎస్ క్యాడర్ పని చేసింది. ఓ దశలో ఆయన గెలుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన చీల్చిన ఓట్లతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఓటమి వైపు వెళ్లేలా చేస్తోంది.
ఎక్కువగా జరగనున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం మరింతగా ఊపందుకుంటుంది. నిజానికి పట్టభద్రులు అంత వ్యతిరేకతతో లేరని ఓటింగ్ సరళితో చూపిస్తోంది. ఓట్లు పార్టీల వారీగా కాకుండా.. అభ్యర్థుల వారీగా పడ్డాయి. అయినా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేక ప్రచారం పెరగడానికి ఈ ఫలితాలు కారణం అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ ఈ అంశంపై మరింత దృష్టి సారించాల్సి ఉంది. లేకపోతే సోషల్ మీడియాలోఆయన ప్రభుత్వంపై ప్రచార యుద్ధం ప్రారంభమవుతుంది.