కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాదని ముందే పసిగట్టి నోటికి వచ్చినట్లు ఆనాడు హామీలు గుప్పించిందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నట్లు తెదేపా ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అరుణ్ జైట్లీ, రాజ్ నాద్ సింగ్ సమావేశమయినప్పుడు జైట్లీ ఈ మాట అన్నట్లు జేసీ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ, 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని అందువలననే ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. కానీ రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కోలుకొనేందుకు కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తుందని, మంచి ఆర్ధిక ప్యాకేజి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆర్ధిక ప్యాకేజీతో బాటు, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇచ్చే విధంగా పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు కూడా కేంద్రం కృషి చేస్తోందని జైట్లీ తెలిపారు.
కానీ అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాదనే సంగతి గ్రహించి ఆవిధంగా నోటికి వచ్చిన హామీలను గుప్పిస్తున్నప్పుడు మరి బీజేపీ వాటికి ఎందుకు వత్తాసు పలికింది? కాంగ్రెస్ ఐదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించినప్పుడు వెంకయ్యనాయుడు “ఐదేళ్ళు సరిపోదు…కనీసం పదేళ్ళయినా ఇవ్వాలని” ఆనాడు సభలో గట్టిగా ఎందుకు పట్టుబట్టారు? కాంగ్రెస్ ఓడిపోతుంది కనుక అది నోటికి వచ్చిన హామీలను ఇచ్చి ఉండవచ్చును. కానీ తరువాత తామే అధికారంలోకి వస్తే అవన్నీ తమ పీకకి చుట్టుకొంటాయని తెలిసి ఉన్నప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఆ హామీలకు బీజేపీ ఎందుకు మద్దతు ఇచ్చింది? తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని ఇలాగే కుంటిసాకులతో పక్కనబెట్టేయవచ్చనే ముందస్తు ఆలోచనతోనే వాటికి మద్దతు ఇచ్చిందా? ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్య పెట్టి అధికారం చేజిక్కించుకొనేందుకే ఆ హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందా? అయినా రాష్ట్ర విభజన విభజన జరిగిపోయిన తరువాత తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలపడానికి లేని సమస్య, 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు చెపితే వాటిని మోడీ తప్పనిసరిగా పాటించి తీరాలా? వంటి అనేక ప్రశ్నలకు బీజేపీ జవాబులు చెప్పవలసి ఉంటుంది.
ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం మాట తప్పినట్లయితే అధికార తెదేపాకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని కలలు కంటున్న బీజేపీ ఆ ఆలోచన అటుంచి ముందు రాష్ట్రంలో పార్టీని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీలాగే నానా తిప్పలు పడవలసి వస్తుంది. ఒకవేళ ఈ కారణంగా తెదేపా దానితో తెగతెంపులు చేసుకొంటే, ఆంధ్రలో బీజేపీని ఆదరించేవారుండరు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోడీ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి యుద్ధం ప్రకటించినందున ఆయన కూడా బీజేపీతో పొత్తులు పెట్టుకోలేరు. అప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఒంటరి అవుతుంది. ప్రత్యేక హోదా అంశం పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అది కూడా మళ్ళీ బలపడినట్లయితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్ళీ మొదటికి రావడం తధ్యం. కనుక బీజేపీ తన హామీలను నిలబెట్టుకొని రాష్ట్ర విభజన ప్రజల ఆదరణ పొంది తన ‘ప్రత్యామ్నాయ కలలను’ నిజం చేసుకోవడమా లేదా అనే సంగతి తేల్చుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ భవిష్యత్ మోడీ ప్రభుత్వం చేతిలోనే ఉంది. నీట ముంచినా పాల ముంచినా దానిదే అంతా భారం.
ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ తో సహా ఎవరి మద్దతు అవసరం లేదు. ఇదివరకు రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రజల గోడును కాంగ్రెస్ అధిష్టానం ఏవిధంగా పట్టించుకోలేదో ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజల గోడును పట్టించుకోనవసరం లేదు. కానీ మళ్ళీ మరో నాలుగేళ్ళలో ఎన్నికలు వస్తాయి. అప్పుడు బహుశః మోడీకి మళ్ళీ ఆంద్రప్రదేశ్ ప్రజల ఓట్లు అవసరం పడవచ్చును. కానీ మళ్ళీ అప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏవిధంగా గుణపాఠం చెప్పారో బీజేపీకి కూడా చెప్పవచ్చును. బీజేపీ అంతవరకు కూడా వేచి చూడనవసరం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పితే వెంటనే దాని ఫలితాలు కనబడుతాయి కనుక ఇప్పుడే చూసుకొనే సౌలభ్యం కూడా దానికి ఉంది.