తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల్ని ప్రకటించింది. గ్యారంటీ కార్డులు ఇస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. కానీ తెలంగాణలో సంక్షేమ పథకాలను ఆకట్టుకోవాలంటే… ఆషామాషీ కాదు. సంక్షేమంలో కేసీఆర్‌ది ప్రత్యేక శైలి. ఆయన పథకాల లబ్దిదారులకు ఇచ్చేది లక్షలే. పథకాల లబ్దిదారుల అనే హోదా రావాలి కానీ లక్షలు వచ్చి పడతాయి. దళిత బంధు దగ్గర్నుంచి గృహలక్ష్మి పథకం వరకూ మొత్తం అదే హై రేంజ్. మరి అలాంటి రేంజ్ ను కొట్టాలంటే ఇతర పార్టీలు అంతకు మించి అన్నట్లుగా ప్రయత్నించాలి.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ హామీలతో ఆ పార్టీకి అక్కడ విజయం దక్కింది. అదే పాచికను తెలంగాణలోనే వేశారు సోనియా గాంధీ. ఈ హామీలు ..కేసీఆర్ ప్రకటించిన సంక్షేమ పథకాల ముందు నిలుస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే… అత్యధిక మందికి ఆశ కల్పించేలా చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని అనుకోవచ్చు. మహిళా శక్తి పథకం కింద ప్రతి మహిళకు రెండున్నర వేలు ఇస్తామని ప్రకటించారు. ఐదు వందల రూపాయలకే సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరింత ఆకర్షణీయం. ఇవి మినహా కాంగ్రెస్ ప్రకటించిన ఇతర పథకాలు బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలకు కొనసాగింపు లాంటివే.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. కేసీఆర్ ప్రకటించిన పథకాలు అందరికీ అందవు. వందలో కొద్ది మందికి ఇస్తారు. మిగతా వారంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ కేసీఆర్ రాకపోతే ఆ పథకాలు రావేమో అని భయపడుతూ బీఆర్ఎస్ కే ఓటు వేస్తారు. ఈ పరిస్థితిని మార్చడానికి పథకాలు అందరికీ వస్తాయని చెప్పడానికి కాంగ్రెస్ కొత్త ప్లాన్ వేసింది . అదే గ్యారంటీ కార్డుల పంపిణీ. ఇలా సభ ముగియగానే అలా కాంగ్రెస్ నేతలంతా ప్రజల్లోకి వెళ్లి .. ప్రతి ఇంటికి ఓ గ్యారంటీ కార్డు పంపిణి చేయనున్నారు. కేసీఆర్ లాగా కాదని.. తాము ఇచ్చే కార్డు తో.. కాంగ్రెస్ రాగానే అన్ని పథకాలు అందిస్తామని భరోసా ఇస్తున్నారు.
ప్రజలు ఐదారు పథకాలను కాదు ఒక్క పథకాన్ని నమ్మితే చాలు ఓట్ల వెల్లువ పారిస్తారు. అలాంటి పథకం ఒకటైనా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీల్లో ఉందో లేదో. ..కొద్ది రోజుల్లో ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారా స్పష్టత వస్తుంది.