లోక్ సభ ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. కర్ణాటక, తెలంగాణలో సక్సెస్ కావడంతో అదే మోడల్ ఫాలో అయింది. ‘పాంచ్ న్యా.య్’ పేరుతో ఐదు అంశాలపై మొత్తం 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ మేనిఫెస్టోలో లేవనెత్తిన ప్రతి అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కాంగ్రెస్ హైకమాండ్ సూచించింది.
రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా పాంచ్ న్యాయ్ రూపుదిద్దుకుందన్నారు. ‘హిస్సేదారి న్యాయ్’, ‘కిసాన్ న్యాయ్’, ‘నారీ న్యాయ్’, ‘శ్రామిక్ న్యాయ్’, ‘యువ న్యాయ్’ పేరిట హామీలను ప్రకటించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన , ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హౌల్డర్లు కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ. లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించే హామీలపై అంత ఆసక్తి ఉండదు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలకు ప్రకటించే మేనిఫెస్టో మాత్రం హైలెట్ అవుతుంది. అదే అంశాలతో అన్ని వర్గాలకూ దశాబ్దాలుగా ఆశ చూపిస్తున్న హామీలనే ఎక్కువగా ఇందులో ప్రకటించారు. ఇందులో ఎంత మేర ప్రజల్ని ఆకట్టుకుంటాయో తెలియదు కానీ.. షెడ్యూల్ రిలీజయిన తర్వాత ప్రకటించడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్లడం ఇబ్బందే.