రైతు రుణమాఫీని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద వేడుకలా నిర్వహించాలని అధికార కాంగ్రెస్ ఫిక్స్ అయింది. ఈమేరకు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు రుణమాఫీని హర్షిస్తూ రైతులతో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. వివిధ జిల్లాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. రుణమాఫీ కావడంతో రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు.. రేవంత్ ను వైఎస్సార్ తో పోల్చారు. 2లక్షల రుణాలను మాఫీ చేస్తోన్న మిమ్మల్ని చూస్తుంటే వైఎస్సార్ గుర్తుకు వస్తున్నారంటూ అభిమానం చాటుకున్నారు. అయితే, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ అని రేవంత్ అనగానే..ఆనందంతో ఆ రైతు రాహుల్ గాంధీని పీఎం చేస్తామని అనడంతో అంతకుముందు మనం చేయాల్సిన ఓ పని ఉందన్నారు.
రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని.. ఆ హామీ మేరకు రుణమాఫీ చేస్తున్నామన్నారు రేవంత్. అందుకే రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ నిర్వహించబోతున్నామని చెప్పుకొచ్చారు. ఎక్కడైతే రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారో.. అదే వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలన్నారు.
త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని భారీ బహిరంగ సభకు హాజరు కావాలని ఆహ్వానిస్తామన్న రేవంత్..ఈ నెలఖారులో వరంగల్ లో సభను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అంటే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వరంగల్ లో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.