రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటున్నట్లుందని చెప్పవచ్చు. ఆ పార్టీని యావత్ దేశప్రజలు తిరస్కరించినపుడు కూడా తెలుగు ప్రజలు నెత్తినపెట్టుకొని మోశారు. అందుకు కనీసం కృతజ్ఞత చూపకపోగా రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజల పట్ల అది చాలా చులకనగా, అవమానకరంగా ప్రవర్తించింది.
తెలంగాణా కోసం అక్కడి ప్రజలు పదేళ్ళపాటు నిరంతరంగా ఉద్యమించవలసి వచ్చింది. అనేక వందలాది మంది యువకులు బలిదానాలు చేసుకొన్నారు. రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం జరిగింది. అంత జరిగినా కాంగ్రెస్ పార్టీకి చీమ కుట్టినంత బాధ కూడా కలుగలేదు. తెలంగాణా కావాలంటే తెరాసని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని నిసిగ్గుగా బేరాలు ఆడి తెలంగాణా ప్రజలని అవమానించింది. ఇప్పుడు అందుకు తగిన శాస్తి అనుభవిస్తోంది. తెలంగాణా రాష్ట్రం ఇచ్చినా దానిని ప్రజలు తిరస్కరించారు. ఆ తరువాత జరిగిన ప్రతీ ఎన్నికలలో దానిని ఓడిస్తూనే ఉన్నారు. తెరాస కూడా కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకొంటున్నట్లుగా తన ఆకర్ష అస్త్రం ప్రయోగించి రాష్ట్రంలో నుంచి కాంగ్రెస్ పార్టీని క్రమంగా తుడిచిపెట్టేస్తోంది. అది చూసి కాంగ్రెస్ పార్టీ నేతలు లబలబలాడుతున్నారు.
ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు నెత్తిన పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర విభజన చేసినందుకు అక్కడి ప్రజలు నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. రాష్ట్రంలో మళ్ళీ నిలద్రొక్కుకోవడానికి ఆ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దానిని అసలు పట్టించుకోవడమే మానేశారు. వచ్చే ఎన్నికలనాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందో లేదో, ఉన్నా ఎన్నికలలో పోటీ చేసేందుకు దానికి అభ్యర్ధులు ఉంటారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి దాపురిస్తుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా హెచ్చరిస్తున్నా ఆయన హెచ్చరికలని పెడచెవిన పెట్టి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఏదో ఘనకార్యం చేసినట్లుగా దిగ్విజయ్ సింగ్ మురిసిపోయారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో ఆయనే కాంగ్రెస్ పార్టీకి తాళాలు వేశారు. అవి నేటికీ తెరుచుకొనే లేదు. ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పార్టీకి తాళాలు వేసేశారు. అవి కూడా ఇప్పుడపుడే తెరుచుకొనే అవకాశాలు కనబడటం లేదు.
కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ బలమైన తాళమే వేస్తున్నారు. దానిని తెరిచే బాధ్యత రాహుల్ గాంధీకి అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కానీ ఆయన వలన అది ఎన్నటికీ సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. కనుక ఇక చేసేదేమీ లేదు. అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, కెసిఆర్ ల నామస్మరణం చేస్తూ కాలక్షేపం చేయకతప్పదు.