కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలసి వస్తున్న సూచనలు కనిపించడం లేదు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారలేదని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 6నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించుకున్నారు. ఆ ఫోటోలను ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విరివిగా వాడేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది. అందుకే బీఆర్ఎస్లో గెలిచిన నేను ఆపార్టీలోనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్లో చేరినట్లు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని వాదిస్తూ పోలీసు కేసు పెట్టారు.
తాను కాంగ్రెస్ లో చేరానన్నది దుష్ప్రచారమేనని చెప్పాలని ఆయన టార్గెట్. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఆయన కాంగ్రెస్ లో చేరింది బహిరంగరహస్యం. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పడం ఏమిటన్న వాదన వినిపిస్తోంది. నిజానికి ఆయన గతంలోనే ఓ సారి వెనక్కి వెళ్లాలని అనుకున్నారు. అప్పట్లో జూపల్లి కృష్ణారావు సర్ది చెప్పి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. సర్దుబాటు అయిందని అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్లీ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని కేసులు పెట్టి వాదిస్తున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అనర్హతా భయం పుట్టించడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందని ఇలాంటి వారి వ్యవహారాన్ని బట్టి అర్థమవుతోందని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఉపఎన్నికలు ఎలా వస్తాయని గట్టిగా చెబుతున్నా.. ఎమ్మెల్యేల్లో మాత్రం ధైర్యం రావడం లేదు. ఎందుకైనా మంచిదని తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నారు. ఫలితంగా గందరగోళం ఏర్పడుతోంది.