“యుద్ధంలో ఒకరిపై గెలవలేమనుకుంటే.. వారిని అసలు యుద్ధానికే రాకుండా చేస్తే పోలా” అన్న నీతి ఆధునిక రాజకీయ రణంలో… కొంత మంది వాడేస్తున్నారు. ఈ వ్యూహాన్ని తనపైనే ప్రయోగిస్తున్నారని.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ముందస్తుగానే పక్కా సమాచారం అందినట్లుగా ఉంది. ఆయన తన జాగ్రత్తలు తాను తీసుకుంటున్నారు. లేనిపోని కారణాలు చూపి తన నామినేషన్ తిరస్కరించేలా టీఆర్ఎస్ వ్యూహం పన్నిందని ఆయనకు పక్కా సమాచారం అందింది. ఏం కారణం చూపుతారంటే… ఆయన తనపై ఉన్న కేసులను చూపించలేదన్న కారణంగా చూపాలనుకున్నారనేది.. రేవంత్ రెడ్డి అనుమానం. కొద్ది రోజుల కిందట.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తీర్పులో.. నామినేషన్లలో… అభ్యర్థులందరూ.. తమపై నమోదైన కేసుల వివరాలను స్పష్టంగా పేర్కొనాలని తీర్పు చెప్పింది. తన కేసుల వివరాలను చెప్పడానికి రేవంత్ రెడ్డికి ఇబ్బందేమీ లేదు కానీ.. అసలు తనపై ఎన్ని కేసులు నమోదయ్యాయో తనకే తెలియదట..!
ఎక్కడో ఏదో కారణంతో.. గుట్టుచప్పుడు కాకుండా కేసు నమోదు చేసి.. తర్వాత ఆ కేసును చూపించలేదన్న కారణంగా.. నామినేషన్ను తిరస్కరిస్తారన్న అంచనాతో.. తనపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ .. డీజీపీ చెప్పడం లేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు అందచేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని కోరినా డీజీపీ ఇవ్వడం లేదని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసినట్లుచెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో తనపై కేసులు నమోదు చేశారని.. ఆ కేసుల్లో ఎటువంటి నోటీసులు రాలేదన్నారు. ఈ కేసుల వివరాలు తెలిసే అవకాశం లేదన్నారు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేటప్పుడు నిబంధనల ప్రకారం అందులో అభ్యర్థిపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ ప్రస్తావించాలి. నాకు తెలియకుండానే నాపై అనేక కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుల వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది మార్చి 14న సమాచార హక్కు చట్టం కింద డీజీపీని కోరినా డీజీపీ స్పందించలేదన్నారు. నేను కోరిన వివరాలు ఇవ్వని పక్షంలో నాకు తీరని ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో.. ?