టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు.. జనాగ్రహం భయం పట్టుకుంది. వారు… ఎక్కడికి వెళ్లినా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూండటంతో.. రాజీనామా చేసి .. టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దీనిపై.. తమ ప్రతిపాదనను… కేటీఆర్ వద్ద పెట్టారని చెబుతున్నారు. మరి కేటీఆర్ అంగీకరిస్తారా..? కేసీఆర్ సై అంటారా..?
రాజీనామాలు చేస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్లీ గెలుస్తారా..?
కాంగ్రెస్ లో ఉంటే నియోజకవర్గ అభివృద్దిని సాధించలేమంటూ 11మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరి సాయంతో కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసేందుకు సిద్దమవుతున్నారు. కాని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ఊహించని పరిణామాలు చవిచూడాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లాలో పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ కు ఎలా ప్రచారం చేస్తావంటూ నిలదీశారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సైతం ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మరికొందరిపై ఫిర్యాదులు కూడా చేస్తున్న పరిస్థితి. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల మరికొందరి నియోజకవర్గాల్లో నేరుగా గొడవలు జరగకపోయినా…టీఆర్ఎస్ తరుపున పోటి చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ముఖ్య నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది.
టీఆర్ఎస్ క్యాడర్ కూడా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గుర్రుగానే ఉంది..!
పరిషత్ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యేలకే అభ్యర్థుల ఎంపిక భాధ్యత ఇచ్చారు. పార్టీ సొంతగా గెలిచిన స్థానాల్లో ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ కే సీట్లు ఇచ్చినా….కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ క్యాడర్ కాకుండా తమ వెంట వచ్చిన అనుచరులకు అవకాశం ఇచ్చారు. దీంతో తమతో ఉన్న క్యాడర్ కు అన్యాయం జరిగిందనే భావనలో సొంత పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు ఉన్నారు. అందుకే ఎమ్మెల్యేలకు సహాయ సహకారాలు అందించడం లేదు. పైగా.. ఫిరాయింపులపై హైకోర్టు వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో వీటన్నింటిని ఎదుర్కొనే బదులు.. టీఆర్ఎస్ జెండాపై గెలుపొందాలని భావిస్తున్నారు.
కేసీఆర్ ఇప్పట్లో అంత రిస్క్ తీసుకునే చాన్స్ తక్కువే..!
టీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారటంపై నియోజకవర్గాల్లో ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నట్లు అధినేతకు రిపోర్ట్ లు అందినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే.. కాంగ్రెస్ ఎల్పీ విలీనం విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం.