కశ్మీర్ విభజన బిల్లుపై జరిగిన చర్చలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశం హైలెట్ అయింది. ఆంధ్రప్రదేశ్ విభజన చేయడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభిప్రాయం తీసుకుందని.. కానీ భారతీయ జనతా పార్టీ..అలా.. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనీష్ తివారీ కేంద్రంపై మండిపడ్డారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మసూద్ కూడా… బిల్లును కశ్మీర్ అసెంబ్లీకి ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కశ్మీర్ ప్రజల అభిప్రాయాలు తీసుకోరా అని ప్రశ్నించారు. ఏపీ విభజన సమయంలో… యూపీఏ ప్రభుత్వం.. అసెంబ్లీ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఏపీ విభజన జరిగిందని మనీష్ తీవారి చెప్పుకొచ్చారు. మనీష్ తివారీ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు తప్పు పట్టారు. అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పటికి… రాష్ట్రాన్ని విభజించారని గుర్తు చేశారు.
అమిత్ షా కూడా.. తరచూ.. ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఏపీని ఎలా విభజించారో మర్చిపోయారా.. అంటూ కాంగ్రెస్ కు చురకలంటించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ తలుపులు మూసేసి.. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేసి మరీ రాష్ట్రాన్ని విభజించినట్లుగా చూపించారు. నిజానికి పార్లమెంట్లో… పద్దతి ప్రకారం.. విభజన జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కశ్మీర్ విషయంలోనూ.. దాదాపుగా అదే జరుగుతోందన్న అభిప్రాయం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఏపీ విభజన బిల్లు ఆమోదం పొందడంలో.. బీజేపీది కూడా ప్రధాన పాత్రే. అయితే.. ఎప్పుడూ.. అందులో తమకు క్రెడిట్ ఉందని చెప్పుకోవడానికి బీజేపీ పెద్దగా ఇష్టపడదు. ఎందుకంటే.. విభజన వివాదాన్ని వివాదాస్పదం చేసి.. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది. కశ్మీర్ విభజన బిల్లుపై చర్చ పుణ్యమా అని..మరోసారి… ఏపీ విభజన అంశం తెరపైకి వచ్చింది. ఎప్పుడు… ఏ రాష్ట్రాన్ని విభజించాలన్నా… బలవంతంగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని.. ఇలా నిరూపిస్తున్నారన్న అభిప్రాయం సాధారణ జనాల్లో వ్యక్తమవుతోంది.