కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాతో వీడియోలు తీసిన ఆరోపణలపై ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇవే ఆరోపణలపై నమోదైన కేసులో ఇప్పటికే ఐదుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాను వాడినందుకు ఈ కేసుల్ని పోలీసులు నమోదు చేశారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లి, తిరిగి వస్తున్న రేవంత్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారం రోజుల కిందట నిబంధనలకు విరుద్ధంగా, నో ఫ్లై జోన్ లో డ్రోన్ వాడారన్న ఆరోపణలతో 8 మంది మీద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్ రెడ్డి ఉన్నారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చుకోవాలని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో రేవంత్ ని అరెస్ట్ చేసి… నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎంపీ ఇచ్చిన సమాచారం మేరకే వీడియోలు తీశానని డ్రోన్ కెమెరా ఆపరేటర్ చెప్పాడనీ, ఆయన ఇచ్చిన వివరాల ప్రకారమే కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. అరెస్టు అయిన రేవంత్ రెడ్డిని 14 రోజులపాటు రిమాండ్ విధించి, చర్లపల్లి జైలుకు తరలించారు.
గతవారం నుంచే తమ పార్టీ నేతల్ని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. భూఅక్రమాలను సహించేది లేదని ప్రభుత్వం చెబుతున్నా… అదే పని మంత్రి కేటీఆర్ చేస్తున్నారని ఎత్తి చూపినందుకే తమపై కేసులు అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ అంశం మరింత పెద్దదైందని చెప్పాలి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. తదుపరి ఎలాంటి కార్యాచరణకు రేవంత్ సిద్ధమౌతారో కూడా వేచి చూడాలి. మొత్తానికి, రేవంత్ విషయంలో ఈ చర్యను రాజకీయ కక్ష సాధింపుగానే కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తుందనడంలో సందేహం లేదు.