కాంగ్రెస్ పార్టీ నల్లగొండ సెంటిమెంట్‌ను పండించేందుకు రంగం సిద్దం చేసుకుంది. మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తే అది నల్లగొండ ప్రజల్ని వ్యతిరేకించినట్లే అన్న భావన తీసుకు వచ్చేందుకు వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పరిధిలో పుట్టిన రోజున రోజు నాడు పాదయాత్ర చేయబోతున్నారు. మూసి ప్రాంత ప్రజలతో పాటు మూసి కాలుష్యం వల్ల పడుతున్న ఇబ్బందుల్ని ఆయన పరిశీలిస్తారు.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా మూసి ప్రక్షాళనను అడ్డుకంటే నల్లగొండ ప్రజలు ఊరుకోరని హెచ్చరిస్తూ వస్తున్నారు. నల్లగొండ ప్రజల్ని ఎందుకు హింసిస్తారని మూసి విషం ఎందుకు నల్లగొండ జిల్లా ప్రజలు తాగాలని ప్రశ్నిస్తూ సెంటిమెంట్ రేపుతున్నారు. మూసి నది ఎక్కువగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ప్రవహిస్తుంది. హైదరాబాద్ లో కలిసే మురికి , డ్రైనేజీ అంతా నల్లగొండకే వస్తోంది. దాని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ పాయింట్ ను క్యాచ్ చేసి.. రాజకీయం చేస్తున్నారు.
కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రచారానికి బీఆర్ఎస్ వద్ద కౌంటర్ కనిపించడం లేదు. తాము మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని దానిలోని దోపిడీకే వ్యతిరేకం అంటున్నారు. అందుకే అడ్డుకుంటున్నామని కవర్ చేసుకుంటున్నారు. అసలు పనులే ప్రారంభించక ముందు ఈ రకమైన దోపిడీ వాదనను ప్రజలు అంగీకరిస్తారు ?. పనుల్ని అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారని అనుకుంటారు. అదే జరుగుతోంది. నల్లగొండ జిల్లాపై బీఆర్ఎస్ ఆశలు వదులుకుంటే..మరోసారి అధికారంలోకి రావాలన్న బీఆర్ఎస్ కల చెదిరిపోతుంది.