హస్తం పట్టు సడలిపోతోంది. తెలంగాణ కాంగ్రెస్ వడలిపోతోంది. తెరాస డెబ్బకు కుదేలైపోతోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం వరకూ ఏ ఎన్నికలు జరిగినా నామ్ కే వాస్తే ఫలితాలే దిక్కవుతున్నాయి. పాలేరులోనూ కారు జోరే తప్ప, చేతి బలానికి చాన్న్ లేదని అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంత పోటీ ఇస్తుందనేదే తప్ప, గెలిచే అవకాశం లేదని అప్పుడే టాక్ మొదలైంది.
తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులకు కొదువలేదు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇంకా ఇతర పదవులు అనుభవించిన వాళ్లూ వందలూ వేల సంఖ్యలో ఉన్నారు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చిత్తశుద్దితో దాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించే వాళ్లే చాలా చాలా తక్కువ. ముఖ్యమంత్రి తప్ప అన్ని శాఖల మంత్రి పదవులనూ అనుభవించిన బడా నాయకులు కూడా నామమాత్రంగా కనిపిస్తున్నారు.
కొందరైతే తెరాసకు మిత్రులుగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ శాసనసభా పక్షం చాలా వరకు ఖాళీ అయింది. పాలేరులో తన సీటును నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కు అసాధ్యమని ఆ పార్టీలోనే చాలా మంది చెప్తున్నారు. గురువారం నాటి ఓట్ల లెక్కింపులో ఏ విషయం తేలిపోతుంది.
కాంగ్రెస్ జాతీయ పార్టీ. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న పార్టీ. రాష్ట్ర శాఖలో అన్నీ తానై పార్టీనినడిపించే నాయకులు ఉంటేనే బలం పెరుగుతుంది. అలాంటి నాయకులు లేని రాష్ట్రాల్లో ఆ పార్టీ అనేక దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నీ తానై పార్టీకి అండగా ఉండేవారు. అధికారానికి రాక ముందు కూడా మంచిచెడులను పట్టించుకునే వారు. వ్యక్తిగత పరిచయాలతో నాయకులను వీలైనంత వరకు ఏకతాటిపై ఉంచడానికి ప్రయత్నించే వారు. ఆయనకంటూ ఒక వర్గం ఉందనే విమర్శలున్నా, అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కలుపుకొని పోయేవారని పేరుంది.
అలాంటి నాయకుడే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు అవసరం. అలాంటి నాయకుడు ఎవరైనా కనిపిస్తే ఆపద్బాంధవుడిగా భావించాల్సి ఉంటుంది. పార్టీ పనిని సొంత బాధ్యతగా భావించి, భుజాన వేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే నాయకుడి కోసం పార్టీ ఎదురు చూస్తోంది. తెలంగాణ పీసీసీ పెద్దలు తమ వంతుగా కొంత కష్టపడుతున్నారు. కానీ వైఎస్ స్థాయి ఇమేజి లేకపోవడం ఒక మైనస్ పాయింట్. వాళ్లు చెప్పిన మాట వినే నాయకులుకూడా తక్కువే. పాలేరులో కూడా పరాజయం పరిపూర్ణమైతే భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్న. 2019 ఎన్నికల నాటికి ఉనికి నామమాత్రంగా మారితే ఇక ఆ పార్టీని ఎవరూ కాపాడలేరేమో. కాంగ్రెస్ విషయంలో తెలంగాణ మరో తమిళనాడు, బెంగాల్, యూపీ, గుజరాత్ అవతుందేమో. ఆ రాష్ట్రాల్లో చివరిసారిగా ఎప్పుడు అధికారంలో ఉన్నారో ఆ పార్టీ అధినేతలకైనా గుర్తుందో లేదో !