తెలంగాణ ఎన్నికల్లో ఎనభై సీట్లు సాధిస్తామని అంత కంటే తగ్గిస్తే కేసీఆర్ వేసే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. కానీ చరిత్ర చూస్తే కాంగ్రెస్ గాలి వీచిన రోజుల్లోనూ… తెలంగాణ ప్రాంతంలో అరవై సీట్లు ఎప్పుడూ సాధించలేదని రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి క్షీణించింది.
1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఏ ఎన్నికలనూ తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో అరవై సీట్లు సాధించలేదు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో 30 సీట్లలోపు పరిమితమయ్యారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు అరవై సీట్లే వచ్చాయి. 1989 ఎన్నికల్లో ఏపీలో మొత్తం 181 సీట్లు కాంగ్రెస్ గెల్చుకుంది. అంత భారీ వేవ్ లోనూ .. తెలంగాణలో కాంగ్రెస్కు 59 స్థానాలే వచ్చాయి.1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు వచ్చింది కేవలం 26 సీట్లు మాత్రమే. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు 185 సీట్లు రాగా, తెలంగాణలో వచ్చినవి 48 మాత్రమే. 2009లో 156 స్థానాల్లో గెలుపొందగా, తెలంగాణలో 49 స్థానాల్లో గెలుపొందింది హస్తం పార్టీ. 1999 ఎన్నికల్లో తెలంగాణలో 42 నియోజకవర్గాల్లోనే గెలుపొందింది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. నలభై ఏళ్ల ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెస్కు తెలంగాణలో వచ్చిన అత్యధిక సీట్లు 59 మాత్రమే. రేవంత్ రెడ్డి చెబుతున్నట్లుగా ఎనభై కాదు.. సాధారణ మెజార్టీకి అవసరం అయిన అరవై తెచ్చుకున్నా.. చరిత్ర సృష్టించినట్లే.