ఫిరాయింపుల్ని అడ్డుకోవాలంటే… చివరికి ఈ మార్గమే టి.కాంగ్రెస్ కి తప్పేట్టు లేదు! ఒక పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పదవికి రాజీనామా చెయ్యకుండా అధికార పార్టీలో చేరేవారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. కానీ, తెలంగాణలో ఆ పరిస్థితే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు తెరాసలోకి జంప్ చేశారు. మరో ఇద్దొరొస్తే… ఏకంగా సీఎల్పీ విలీనానికే తెరాస చూస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కి ఒకటికి రెండుసార్లు ఫిర్యాదులు ఇచ్చేరే తప్ప, తెరాసపై ఒత్తిడి పెరిగేలా ఎలాంటి చర్యల్నీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీసుకోలేకపోయారనే అభిప్రాయం ఉంది. అయితే, ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి, ఫిరాయింపులపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం కొంత ఫలిస్తున్నట్టుగానే కనిపిస్తోంది.
పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావును స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. కాంగ్రెస్ టిక్కెట్ పై గెలిచి, ఇప్పుడు తెరాస తరఫున ఓటెయ్యాలంటూ ఎలా ప్రచారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇదే తరహాలో నిన్న (శనివారం) ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మీద కూడా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనలో రాళ్లు విసురుకోవడాలు, స్వల్పంగా దాడులకు దారి తీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కామేపల్లి మండలంలో ప్రచారానికి వెళ్లిన హరిప్రియను అక్కడి కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసను విమర్శించి, ఇప్పుడు అదే పార్టీకి ఓటెయ్యమంటూ ఎలా అడుగుతావంటూ ఆమెను నిలదీశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూడా ఇలానే అడ్డుకోవాలంటూ భట్టి కాంగ్రెస్ శ్రేణులకు చెబుతున్నారు.
ఫిరాయింపులపై ఎవరో ఒకరు చర్యలకు దిగాల్సిందే. అయితే, ఈ క్రమంలో హింసకు తావులేకుండా ఉంటే బాగుంటుంది. నిజానికి, ఈ జంప్ జిలానీలపై అసెంబ్లీ స్పీకర్ స్పందించి, చర్యలు తీసుకోవాలి. కానీ, పార్టీ కార్యకర్తలే తిరబడే పరిస్థితి వస్తోంది. తాత్కాలికంగా తెలంగాణ కాంగ్రెస్ కి ఇదొక సానుకూల అంశంగా కనిపిస్తున్నా, ఓరకంగా ఇది మంచి సంప్రదాయం కూడా కాదు. జంప్ జిలానీలపై ప్రభుత్వాలే చర్యలకు దిగాలి. అనర్హత వేటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజీనామా చెయ్యకుండా పార్టీ మారితే చర్యలు తప్పవు అనే అభిప్రాయం అభ్యర్థుల్లో కలిగించగలిగితే…. ఈ జంప్ జిలానీ రాజకీయాలకు అడ్డుకట్టపడ్డట్టు అవుతుంది. కానీ, ఆ తరహా చర్యలు అధికార పార్టీలు తీసుకుంటాయా… అనుమానమే?