దేశంలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్, ఎప్పుడు ఎక్కడ తిరుగుబాటు వస్తుందో అని హడలిపోతోంది. బెంగాల్ బెంగ ఆ పార్టీకి మరీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్టుంది. కొత్తగా గెలిచిన 44 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ పత్రాలు రాయించుకుంది. అదికూడా అలా ఇలా కాదు, 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఎమ్మెల్యేలు అఫిడవిట్లు రాసి సంతకం చేశారు.
సోనియా గాంధీజీకి, రాహుల్ గాంధీజీకి విధేయులమై ఉంటామని ప్రమాణం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడబోమని వాగ్దానం చేశారు. బుధవారం ఈ విషయం బయటు పొక్కగానే రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. టీవీ చానళ్లలో ఇదే వార్త మోత మోగింది. దీంతో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అయింది. అయితే ఇది రాష్ట్ర నాయకత్వం పనే తప్ప, సోనియా, రాహుల్ చెప్పలేదని కాంగ్రెస్ నేతలు వివరణ ఇచ్చారు. అయినా, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం హైకమాండునే టార్గెట్ చేశారు.
ఈ పరిణామం కాంగ్రెస్ నేతల మన:స్థితికి అద్దం పడుతోందంటున్నారు పరిశీలకులు, 2014 ఎన్నికల షాక్ నుంచి తాము తేరుకుని, కేడర్ లో ఉత్తేజం నింపాల్సిన నాయకులే నిస్తేజంగా కనిపిస్తున్నారు. వరసగా ఒక్కో రాష్ట్రంలో ఓటమి ఎదురు కావడం హైకమాండ్ కు దెబ్బమీద దెబ్బగా మారింది. ముందుండి నడిపించాల్సిన రాహుల్ గాంధీ ఆ మధ్య ఆత్మ పరిశీలన పేరుతో రెండు నెలలు అడ్రస్ లేకుండా ఎక్కడికో వెళ్లారు.
బెంగాల్ అఫిడవిట్ల వ్యవహారం ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రం ఇచ్చినట్టయింది. ఇప్పటికే కాంగ్రెస్ పై ఊపిరిసలపకుండా విమర్శల దాడి చేస్తున్న కమలనాథులు మరోసారి వరుచుకుపడ్డారు. ఇలా బాండ్ రాయించుకోవడం బానిసత్వమని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఏ పార్టీ ఇలా చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైన తర్వాత నాయకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కు ఇంత కష్టకాలం ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఎమర్జెన్సీ తర్వాత ఘోరంగా ఓడిపోయినా, ఇందిరా గాంధీ పడిలేచిన కెరటంలా నిలబడ్డారు. మరోసారి ప్రధానిగా ప్రజల ముందుకు వచ్చారు. అలాంటి ధీరత్వం, రాజకీయ చాతుర్యం ఉన్న నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ కు అవసరం. కానీ సోనియా లేదా రాహుల్ ఆ పనిచేయలేరు. సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. యవనేత రాహుల్ ఇంకా అమ్మచాటు బిడ్డగానే ఉన్నారు. ఎదగాల్సినంతగా ఎదగలేదు. ప్రియాంక రావాలనే డిమాండ్ వినవస్తున్నా, వస్తే విజయాలు గ్యారంటీయా అంటే కాలమే జవాబు చెప్పాలి.