దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే పెద్ద షాకిచ్చింది. 2009లో దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఉప ఎన్నికలో మూడో స్థానానికి పరిమితమైంది. సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దుబ్బాకలో గెలవకపోయినప్పటికీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికలో మాత్రం మూడో స్థానానికి పడిపోయింది. విజేత మాత్రమే కాదు.. ప్రతిపక్షం ఎవరో కూడా దుబ్బాక తేలుస్తుందని జరిగిన ప్రచారం కారణంగా.. ఇప్పుడు కాంగ్రెస్ పనైపోయిందన్న అభిప్రాయం పెరగుతోంది. దుబ్బాకను కాంగ్రెస్ సీరియస్గా తీసుకంది. హేమాహేమీల్లాంటి నేతలందరూ.. రంగంలోకి దిగారు.
కొత్త ఇంచార్జ్ ఠాగూర్ దిశానిర్దేశం చేయడంతో.. ఒక్కో మండలం బాధ్యతను తీసుకున్నారు. రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర ఇలా ప్రతీ ఒక్కరూ తమ తమ మండలాల్లో ఒక్క ఓటు మెజార్టీ అయినా తెస్తామని పంతం పెట్టుకున్నారు. కానీ అందరూ మూకుమ్మడిగా ఫెయిలయ్యారు. దుబ్బాకలో పార్టీ పరిస్థితి చూసి కాంగ్రెస్ నేతల కడపు మండిపోయింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల దిష్టి బొమ్మలు కూడా దహనం చేశారు.
ఉత్తమ్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోతూ వస్తోందని.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. చాలా రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా.. అటూ ఇటూ అన్నట్లుగా ఊగిసలాడుతోంది. పీసీసీ చీఫ్ మార్పు విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. ఇప్పుడైనా… ఓ నేతను ఎంపిక చేసుకోకపోతే.. మూడో స్థానమే పర్మినెంట్గా ఫిక్సయిపోతుందన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.