ఒక దశాబ్దకాలం పాటు కంటి సైగతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాసించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఇప్పుడు తరచూ రోడ్డున పడుతుండటం విశేషం. బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల వ్యవహారంలో ప్రశ్నించడానికి కొన్ని నెలల క్రితం సిబీఐ మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ కి నోటీసులు పంపినప్పుడు, ఆయనకు సంఘీభావం తెలిపేందుకు సోనియా గాంధీ తన ఎంపీలతో కలిసి పార్లమెంటు భవనం నుంచి ఆయన ఇంటి వరకు పాదయత్రం చేసారు.
ఆ తరువాత రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రులు, విదేశాంగ మంత్రి రాజీనామాలు కోరుతూ పార్లమెంటు ఆవరణలో తన ఎంపీలు, నేతలు, కార్యకర్తలతో కలిసి సోనియా, రాహుల్ గాంధీ ధర్నాలో పాల్గొన్నారు. దేశంలో పెరుగుతున్న మత అసహనాన్ని, రచయితలపై దాడులను నిరసిస్తూ మళ్ళీ నిన్న వారిరువురూ తమ పార్టీ ఎంపీలు, నేతలు, కార్యకర్తలతో కలిసి పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేసారు. అనంతరం సోనియా గాంధీ కొందరు ఎంపీలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి దేశంలో ఏర్పడిన ఈ పరిస్థితులను వివరించి వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు చేప్పట్టవలసిందిగా మోడీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఒక విజ్ఞప్తి పత్రం అందజేశారు.
కాంగ్రెస్ స్వీయ తప్పిదాల కారణంగానే సార్వత్రిక ఎన్నికలలో ఘోరపరాజయం పొందిందనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. అదే సమయంలో బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాని అభ్యర్ధిగా ఎంచుకోవడంతో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓటమి ఖరారయిపోయింది. ఏవిధంగా చూసినా రాహుల్ గాంధీ ఆయనకు సరిసమానం కాదని ఎన్నికలకు ముందే తేలిపోయింది. మోడీ ప్రవేశంతోనే కాంగ్రెస్ అధిష్టానం తన ఓటమి ఖాయం అని గ్రహించింది. అందుకే రాహుల్ గాంధీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే సాహసం చేయలేదు. కనీసం ఆయనే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహిస్తారని ప్రకటించేందుకు కూడా వెనకాడిందంటే కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితిలో ఎన్నికలకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చును. ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందింది. లోక్ సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించుకోలేకపోయింది. ఈ పరిమాణాలన్నిటినీ చూసి ఆందోళన చెందిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సోనియా, రాహుల్ గాంధీ తమ పదవులలో నుంచి తప్పుకొని వేరేవారికి కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని వారికి వ్యతిరేకంగా గళం విప్పారు.
తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని సోనియా గాంధీ పరితపిస్తే, ప్రధాని కుర్చీలోనే కాదు కాంగ్రెస్ అధ్యక్ష కుర్చీలో కూడా కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, నానాటికీ ఆయనకి దేశవిదేశాలలో పెరుగుతున్న ఆదరణ అన్నిటినీ చూస్తుంటే ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇపుడప్పుడే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు, ఆ కారణంగా రాహుల్ గాంధీ తన జీవితంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. పైగా పార్టీలో అసమ్మతి క్రమంగా పెరుగుతోంది. తమ ఈ దుస్థితి అంతటికీ ప్రధాని నరేంద్ర మోడియే కారణమనే భావం ఆ తల్లి కొడుకుల్లో నెలకొని ఉండటం సహజం. బహుశః అందుకే ఆయనను లక్ష్యంగా చేసుకొని వారు వీధి పోరాటాలకు కూడా సిద్దపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.