బుధవారం నాడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం తథ్యం అనుకున్నారు. ఆయన తరఫు లాయర్లూ అదే చెప్పారు, అభిమానులు కూడా అదే ఆశించారు. కానీ, కూకట్ పల్లి కోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. మంత్రి కేటీఆర్ కి చెందిందిగా చెప్తున్న ఫామ్ హౌస్ మీద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారనే కేసులో రేవంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
రేవంత్ బెయిల్ పిటీషన్ ను నార్సింగి పోలీసులు కోర్టులో వ్యతిరేకిస్తూ కౌంటర్ దాఖలు చేశారు. గతంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో, పోలీసులను నెట్టుకుంటూ రేవంత్ రెడ్డి వెళ్లారనీ, వారి విధులకు ఆటంకం కలిగించారనే కేసు కూడా ఈ సందర్భంగా ప్రస్థావనకు వచ్చింది. ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ ఇవ్వాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఒక పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ బెయిల్ ను కోర్టు నిరాకరించింది. మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకోవాలంటే ఉప్పరపల్లి కోర్టును రేవంత్ ఆశ్రయించాల్సి ఉంటుంది. గతంలో నమోదైన కేసులన్నీ ఈ సందర్భంగానే ప్రస్థావనకు వచ్చేట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.
బెయిల్ నిరాకరణ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతల నుంచి ఎలాంటి స్పందనా లేదు! అరెస్టు అయిన రోజున కొంత హడావుడి చేశారు, అంతే. రేవంత్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. షబ్బీర్ అలీ, సీతక్క, మల్లు రవి లాంటి నేతలు ఆయనకి మద్దతుగా నిలుస్తుంటే, ఇతర సీనియర్ నేతలు ఆయన చర్యల్ని పట్టించుకోవడం లేదు. రేవంత్ బెయిల్ మీద విడుదలై వస్తే భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయనకి మద్దతుగా నిలిచిన నేతలు కొందరు ప్రతిపాదిస్తే, దీనిపై సీనియర్లు ఎవ్వరూ నోరు మెదపలేదని సమాచారం. మొత్తానికి, ఇప్పుడు రేవంత్ ఒంటరి పోరు చెయ్యాల్సి వస్తోంది.