ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బలమూరి వెంకట్ అద్దంకి దయాకర్ పేర్లను హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్లు దాఖలు చేయాలని హైకమాండ్ నుంచి వారికి సమాచారం వచ్చింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేశారు. తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు టిక్కెట్ కోసం పోటీ పడలేదు. అద్దంకి దయాకర్ తుంగతుర్తి సీటు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డు పడి తన వారికి ఇప్పించుకోవడంతో టిక్కెట్ మిస్ అయింది. అయినా అద్దంకి దయాకర్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. అద్దంకి దయాకర్ రేవంత్ కు బాగా దగ్గర వ్యక్తిగా పేరు ఉంది.
కాంగ్రెస్ పార్టీకే రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 2 స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అంటే మెజారిటీ ఉన్న కాంగ్రెస్ సభ్యులు రెండుసార్లు ఓటేస్తారు. అలా రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కుతాయి. బీఆర్ఎస్ పోటీ పెట్టే అవకాశం లేదు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడంతో ఇద్దరూ గతనెల 9న తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
గవర్నర్ కోటాలో రెండు స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. వీటిని కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ల పేర్లు ఖారరు చేసినట్లుగా తెలుస్తోంది. వీరి పేర్లు కేబినెట్ లో ఆమోదించిన తర్వాత గవర్నర్ కు పంపుతారు.