కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మెచ్చే పథకాలను ప్రవేశపెడుతుంది కానీ.. దానికి పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రం విఫలమవుతోందన్న అభిప్రాయం ఉంది. మాములుగా అయితే పబ్లిసిటీ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఈ సోషల్ మీడియా యుగంలో మంచి చేసినా అందులో లోపాలు వెదికి ప్రజల్ని రెచ్చగొట్టేందుకు విపక్షాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకే రివర్స్ లో పాజిటివ్ ప్రచారం కీలకంగా మారింది.
సన్నబియ్యం పథకం అనేది ఓ అద్భుతమైన ఆలోచన. బియ్యం అందుబాటులో ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎవరూ చేయని విధంగా పథకం అమలుకు సిద్ధపడింది. ఇక్కడా విమర్శలు చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. అన్నం ముద్దగా అయిందని.. ముద్ద దిగడం లేదని.. రకరకాల ప్రచారాలు చేస్తారు. కానీ పేదవాడికి తినే బియ్యం ఇస్తున్నారన్న నిజాన్ని మాత్రం అంగీకరించరు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్, ప్రభుత్వం కూడా ప్రచారం చేసుకోవాల్సి ఉంది.
ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్తంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం రేవంత్ ఎక్కడికి వెళ్లినా లబ్దిదారుల ఇంట్లో రేషన్ దుకాణంలో తెచ్చిన సన్నబియ్యంతో చేసిన వంటనే తినే కార్యక్రమం పెట్టుకున్నారు. సాధారణంగా సీఎం అయ్యే.. హంగూ ఆర్భాటాలు … కృత్రిమ ఏర్పాట్లు ఉంటాయి. అలాంటివి లేకండా సన్నబియ్యంతో వండిన వంచనే తినేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచారంలో నిజాయితీ.. పథకంలో నిజాయితీ ఉందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది.
అయితే ఇది ఒక్కటే సరిపోదు. .. విపక్షాలకు చెందిన సోషల్ మీడియా సన్నబియ్యంపై దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉంటుంది. ఉచిత బస్ విషయంలో ఎక్కడో ఓ చోట సీట్ల కోసం జరిగే తోపులాటల్ని చూపించి..ఉచిత బస్సు ఎవడివ్వమన్నాడు అంటున్నారని ప్రచారం చేశారు.. ఇప్పుడు కూడా సన్నబియ్యం ఎవడివ్వమన్నాడు అంటూ ప్రచారం చేస్తారు., వాటన్నింటికీ కౌంటర్ ఇచ్చేలా కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సి ఉంది.