ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ కాపులను బీసీ జాబితాలో చేర్చేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ ఇన్చార్జ్ కూడా అయిన ఈయన కాపు రిజర్వేషన్లు మాత్రమే కాదు ప్రత్యేక హోదా కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యం అని నొక్కివక్కాణించారు. తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని అలాగే కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఈ రెండు హామీల కారణంగా నమ్మి ఓట్లు వేస్తారా?
ప్రత్యేకహోదా :
కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అంటే ముంత లో ఉన్న నీళ్లు తామే పారబోసి, ఇప్పుడు మబ్బుల్లోంచి నీళ్ళు తెచ్చి ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేస్తున్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కావలసిన విభజన బిల్లు రూపొందించింది వాళ్లే. ఆ బిల్లు రూపొందించేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఏదోరకంగా న్యాయం చేసేలా ప్రత్యేక హోదా కూడా బిల్లులో పెట్టడం, లేదా విభజన బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే ప్రత్యేక హోదా ప్రకటించి ఆంధ్ర ప్రజలను కాస్త సముదాయించడం లాంటివి చేసి ఉంటే ప్రజలు కూడా అర్థం చేసుకుని ఉండేవారు. అప్పుడేమో సమన్యాయం చేస్తే తెలంగాణలో రావలసిన మైలేజ్ రాదు అన్న ఉద్దేశ్యంతో ఏకపక్షంగా బిల్లు రూపొందించి, ప్రత్యేక హోదా అంశాన్ని తూతూమంత్రంగా చివరాఖర్లో ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా మేమిస్తాం మాకు ఓటు వేయండి అని ప్రాధేయ పడుతున్నారు. అవకాశం వారి చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత చేసి ఉంటే ప్రజల్లో కాస్తోకూస్తో కాంగ్రెస్ అంటే నమ్మకం మిగిలి ఉండేది.
కాపు రిజర్వేషన్లు :
ఇక కాపు రిజర్వేషన్లు. 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆ హాని గురించి ఆలోచించిన పాపాన పోలేదు. అసలు గతంలో ఉన్న కాపు రిజర్వేషన్లను తీసివేసిన కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రే. ఆ తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి ఎన్నికల స్టంట్ గా జీవో విడుదల చేసి కాపు రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ తర్వాత ఆ అంశం కోర్టుకు వెళ్లగానే ప్రభుత్వ తరఫున ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా ఆ రిజర్వేషన్లు కొట్టివేయడానికి కారణమయ్యారు కాంగ్రెస్ వాళ్లు. 2004లో కాపు రిజర్వేషన్ల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసినప్పటికీ కాపు రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం పూర్తిగా మరుగున పడి వేసింది. ఆ పదేళ్లలో కాపు రిజర్వేషన్ల గురించి ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చి మాకు అధికారమిస్తే కాపు రిజర్వేషన్లు ఇస్తాము అని ప్రకటిస్తే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు.
కాపులకు పెద్ద పీట :
అలాగే కాపులకు అన్ని రకాలుగా న్యాయం చేసేది కాంగ్రెస్సే అన్న వాదన కూడా సమంజసంగా లేదు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా పనిచేసి ఇప్పుడు జనసేన లో ఉన్న మాదాసు గంగాధర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,రాహుల్ గాంధీతో జరిగిన ఒక సమావేశంలో మిగతా అందరూ కాంగ్రెస్ నాయకుల ముందే తాను కాంగ్రెస్ కాపులకు ఒకసారైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తే దాని ప్రభావం బాగా ఉంటుందని వ్యాఖ్యానించినప్పుడు అక్కడ ఉన్న రెడ్డి నాయకులంతా నన్ను ఆపారని, రాహుల్ గాంధీ కూడా అసలు ఆ విషయానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి విలీనం చేయక పోయి ఉంటే గనక కాంగ్రెస్ పార్టీ 2014వరకు మనుగడ సాగించి ఉండేది కాదు అన్నది వాస్తవం. అత్తెసరు మెజారిటీతో 2009లో అధికారాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, రాజశేఖరరెడ్డి మరణాంతరం జగన్ మోహన్ రెడ్డి వెళ్లిపోయిన, తర్వాత కాపులకు ప్రాధాన్యత ఇస్తోందని పలుదఫాలుగా ప్రకటించినప్పటికీ బొత్స, కన్నా ,చిరంజీవి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి గా చేస్తుందని పలుసార్లు కథనాలు, రూమర్లు వచ్చినప్పటికీ అత్యున్నత పదవిలో కాపులను ఉంచడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన దానం నాగేందర్ కూడా కాంగ్రెస్‌లో రెడ్లకు తప్ప మిగతా వాళ్లకు గొప్ప భవిష్యత్తు ఉండదని వ్యాఖ్యానించాడు. ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీ కాపులకు ఇతోధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఎక్కడా కనిపించడం లేదు.
చేతిలో అవకాశం ఉన్నప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వకుండా, మేనిఫెస్టోలో పెట్టి కూడా కాపు రిజర్వేషన్లు అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా , అధికారంలో ఉన్నంత సేపు ఒక సామాజిక వర్గానికి మాత్రమే పట్టం కట్టి ఇప్పుడు అధికారం ఓడిపోయాక హామీల మీద హామీలు ఇస్తూ, అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని, అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్లు ఇస్తామని, అధికారంలోకి రాగానే కాపులకు పెద్దపీట వేస్తామని, అధికారంలోకి రాగానే చంద్రమండలం మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ ప్లాట్లు వేస్తామని చెప్పినా, ప్రజల నుంచి స్పందన రావడం లేదు.
-జురాన్