తెలంగాణ కాంగ్రెస్ వర్కంగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన అనధికారిక ప్రచార కమిటీ చైర్మన్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక క్రౌడ్ పుల్లింగ్ లీడర్ అయిన రేవంత్‌ను ఏఐసిసి గుర్తించింది. ఆయన సేవలను విరివిగా వాడుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వడమే కాదు.. ఏకంగా.. ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌ను కేటాయించింది. కొడంగల్ లోని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. రోజూ.. కొడంగల్ నుంచి.. రేవంత్ బయలుదేరి.. నాలుగైదు ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటున్నారు.
రేవంత్ రెడ్డికి.. కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 2 వరకు 28 బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల ఎన్నికల ప్రచారాన్ని హెలికాప్టర్ ద్వారా నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి తామే పెద్ద దిక్కులం అని చెప్పుకుంటున్న వారి నియోజకవర్గాల్లోనూ.. రేవంత్ ప్రచారం చేయబోతున్నారు. జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డిని ప్రచారంలోకి దింపితేనే… ప్రయోజనం ఉంటుందని నివేదికలు రావడంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రౌడ్ పుల్లింగ్ నేతలే లేరు. కేసీఆర్‌ను ఢీకొట్టేలా వాగ్ధాటి ఉన్న నేత ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. అందుకే రేవంత్ ప్రచార కమిటీ పదవిని కోరుకున్నారు. విజయశాంతి, భట్టి విక్రమార్కలకు ప్రచారం బాధ్యతలు ఇచ్చినప్పటికీ.. అది ఫలించే నిర్ణయం కాదనుకున్నారు. సునీతా లక్ష్మారెడ్డి, షబ్బీర్ అలీ లాంటి సీనియర్ నేతలతో పాటు.. అనేక మంది అభ్యర్థులు తమకు రేవంత్ రెడ్డి ప్రచారం కావాలని కోరుకున్నారు. ఈ మేరకు హైకమాండ్ కు లేఖలు పంపడంతో.. వారు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రచారభారం అంతా రేవంత్ భుజాలపై పడినట్లయింది.