తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది. రాజీనామా పత్రం నిబంధనలకు విరుద్ధంగా రెడీ చేసి అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు. స్పీకర్ ఫార్మాట్ అంటూ ఒకటి ఉంటుంది. అందులో ఉన్నట్లుగా రాజీనామా చేస్తేనే పరిగణనలోకి తీసుకుంటారు. అది రాజీనామాల ఎక్స్ పర్ట్ హరీష్ రావుకు తెలియనిది కాదు. కానీ ఆయన రాజకీయం మాత్రమే చేయాలనుకున్నారు. ఓ పెద్ద కథ రాసుకుని వచ్చి అదే రాజీనామా పత్రమని హడావుడి చేశారు. అది ఎందుకు పనికి రాదని తెలుసు కాబట్టి ఇదో జర్నలిస్టులకు ఇచ్చిపోతున్నానంటూ ఎవరికో ఇచ్చి వెళ్లిపోయారు.
హరీష్ రావు చేసిన ఈ హాడావుడి చూసి చాలా మంది అగ్గిపెట్టె ఎపిసోడ్ ను గుర్తు చేసుకున్నారు. ఇంకొంత మంది గతంలో టీడీపీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇస్తే ఎన్టీఆర్ భవన్ లో అటెండర్ గా పని చేస్తానన్న సవాల్ ను గుర్తుకు తెచ్చుకున్నారు. ఇలాంటి డ్రామాలు ఆడటంలో హరీష్ రావు ఎక్స్ పర్ట్ అనిసెటైర్లు వేశారు. ఉత్తుత్తి రాజీనామా లేఖను తెచ్చినట్లుగా తెలియడంతో కాంగ్రెస్ నేతలు కూడా సెటైర్లు వేశారు. కేసీఆర్ చెప్పిన సీస పద్యాన్ని రాసుకొస్తే అది రాజీనామా లేఖ ఎలా అవుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అయినా తాను సవాల్ కు కట్టుబడి ఉన్నట్లుగా స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అయితే హరీష్ రావు మొదట ఈ ఒక్క సవాల్ కు కట్టుబడి ఉండకుండా.. ఆరు గ్యారంటీలు.. 420 హామీలు అంటూ వేరే దారిలోకి వెళ్లడంతో ఆయన సవాల్ ను స్వీకరించడం లేదని స్పష్టమయింది. కానీ రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా పెద్దగా పండలేదు.