తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని తేలడంతో కాంగ్రెస్ లో మిగిలి ఉన్న నేతల్లో కలవరం ప్రారంభమయింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఓ వైపు సాగుతూ ఉండగానే.. మరో వైపు.. పార్టీలో మిగిలి ఉన్న ఓ మాదిరి నేతలు చిత్ర విచిత్రమైన కాంబినేషన్లు సెట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్.. ఈ విషయంలో రెండు అడుగులు ముందుకేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. జగన్‌కు అభ్యంతరం లేకపోతే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని ప్రకటించారు. జగన్‌తో పొత్తు కోసం తాను స్వయంగా కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుతానని ప్రకటించారు.
ఒక వేళ జగన్మోహన్ రెడ్డికి సమస్యలు ఉంటే… అంగీకరించకపోతే ఆయన మరో ఆప్షన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఆ ఆప్షన్ జనసేన. పవన్‌తో పొత్తుకు కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఎంపీగా చింతామోహన్ వరుసగా రెండు సార్లు తిరుపతి నుంచి గెలిచారు. విభజన ఎఫెక్ట్ తో.. గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందేమో అని ఆశగా చూసిన ఆయనకు.. పొత్తుల్లేకపోవడంతో షాక్ తగిలినట్లయింది. ఇతర పార్టీల్లో చింతామోహన్ ను చేర్చుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకే ఇతర పార్టీల్లో చేరడం కంటే.. కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకుంటే.. తన సీటు అయినా తనకు వస్తుందన్న ఆశతో ఆయన ఉన్నారు.
రాష్ట్ర విభజన ఎఫెక్ట్ , జగన్ వైసీపీ ఏర్పాటు చేసుకోవడంతో.. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏపీలో నిర్వీర్యం అయిపోయింది. నేతలందరూ.. ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలో చేరిపోయారు. కొంత మంది 2014 ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ, టీడీపీల్లో చేరిపోగా.. మరికొంత మంది మాత్రం.. ఎన్నికల తర్వాత చేరారు. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతోనే.. ఇతర పార్టీల్లో అవకాశాలు దొరకని వారో మాత్రం.. కొన్నాళ్లు పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు.. ఎన్నికలకు దగ్గరకు వచ్చిన సమయంలో.. వారు కూడా పక్క చూపులు చూసుకుంటున్నారు.