కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తామని గట్టి మేనిఫెస్టోతో తెర ముందుకు వచ్చింది. తుక్కుగూడలో భారీ సభ పెట్టి తెలుగులోనూ విడుదల చేశారు. తెలంగాణ సుదీర్ఘ డిమాండ్లు.. ఏపీ ఎన్నికల డిమాండ్లు అన్నీ ఉన్నాయి. ప్రత్యేకహోదా ఇస్తామన్నారు. పాంచ్ న్యాయ్ – పచ్చీస్ గ్యారంటీస్ పేరుతో దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్న ప్రజల డిమాండ్లన్ని మేనిఫెస్టోలో ఉన్నాయి.
దేశంలో కాంగ్రెస్ పార్టీ గట్టి సవాళ్లను ఎదుర్కొంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చాలా సమస్యలు వస్తాయి. అందుకే అచ్చి వచ్చిన గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చింది. పేదలు, రైతులు, యువత, మహిళలు..ఇలా ఒక్కో వర్గానికి న్యాయం జరిగేలా కీలక హామీలను చేర్చింది. దేశంలో రిజర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. వారందరి కోరికలకు అడ్డంగా 50 శాతం పరిమితి ఉంది. దాన్ని తొలగిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకున్న అగ్నివీర్ స్కీమ్నీ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది.
కాంగ్రెస్ గ్రాఫ్ 2014 నుంచి పడిపోతూ వస్తోంది. క్రమక్రమంగా అన్ని చోట్లా అధికారం కోల్పోయింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైంది. తెలంగాణలో మాత్రం అధికారం సాధించుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు వేరు. లోక్సభ ఎన్నికలు వేరు. గత రెండేళ్లుగా పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర చేశారు. ఇప్పుడు అందరి కోరికను కలిపి మేనిఫెస్టోగా తెచ్చారు. ప్రజలు ఎంత నమ్మితే..కాంగ్రెస్కు అంత న్యాయం జరుగుతుంది. నమ్మకాన్ని పెంచుకున్నరా లేదా అన్నదాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి.