పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ వైపు ఏదో ఓ కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వెళ్లి.. తాము రేసులో ఉన్నామని ప్రజలకు గుర్తు చేస్తున్నారు. మరో వైపు సీనియర్ నేతల పేరుతో కొంత మంది ఆయనను కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కోసం చేస్తారో తెలియదు కానీ.. సీనియర్ల పేరుతో అసంతృప్త సమావేశాలు పెట్టి కాంగ్రెస్‌ను బద్నానం చేయాలనుకునే మీడియాకు పావులుగా మారుతున్నారు. తాజాగా మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. దానికి మీడియాలో రేవంత్ రెడ్డి .. కొల్లాపూర్‌లో పెట్టిన సభ కన్నా మీడియాలో ఎక్కువ ప్రచారం లభించింది.
కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, వి. హెచ్ , పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి తో పాటుమరికొంత మంది నేతలు మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో 3 గంటలకుపైగా సమావేశం అయ్యారు. రేవంత్ రెడ్డి పైనే అందరూ చర్చించారు. ఆయన పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందనుకున్నారు. సీనియర్లతోపాటు ముఖ్యనేతలను పట్టించుకోవడం లేదని తీర్మానించుకున్నారు. రేవంత్ పై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని నిరణయించారు. “కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం” అంటూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
కొల్లాపూర్‌లో జరిగిన సభలో.. పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని రేవంత్ ప్రకటించారు. టీపీసీసీ కార్యవర్గంలోగానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోగానీ మాట్లాడకుండా, అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకోకుండా రేవంత్ ఈ ప్రకటన చేయడం ఏమిటని సీనియర్ల అభ్యంతరం. కొన్నాళ్లుగా రేవంత్ పాదయాత్రపై చర్చ జరుగుతోంది. పోటీగా కొంత మంది సీనియర్లు కూడా రావడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇలాంటి సీనియర్ నేతల్ని హైకమాండ్ ఉపేక్షించదని.. చెబుతున్నారు. అయితే .. కాంగ్రెస్ నేతలు కళ్ల ముందు అన్నీ కనిపిస్తున్నా.. పంజాబ్ తరహాలో తమ నెత్తి మీద తాము చెయ్యి పెట్టుకుంటున్నారన్న భావన ఎక్కువగా వినిపిస్తోంది. అయినా మారరు..అదే కాంగ్రెస్ పార్టీ స్టైల్ అనుకోవచ్చు.